రాజమౌళి కొత్త సినిమా ఆరంభమైంది కానీ…

Rajamouli And Mahesh Babu Movie Begins

ఈగ వాలిన చోటు ఒక్క నిమిషం కూడా ఉండదు కానీ రాజమౌళి ‘ఈగ’ సినిమాతో రెండేళ్ళు లాగించేశారు. ఆయన శ్రమకు తగిన ఫలితం కూడా లభించింది. ఆ తర్వాత బాహుబలి 1,2, ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలకు మరో 5-6 ఏళ్ళు సమయం తీసుకొని ఆస్కార్ సాధించారు.

వాటి తర్వాత మహేష్ బాబుతో సినిమా తీస్తా అంటూ దాదాపు రెండేళ్ళు లాగించేసి ఇవాళ్ళ (గురువారం) హైదరాబాద్‌లో పూజా కార్యక్రమం చేశారు. ఎప్పటిలాగే ఈ పూజా కార్యక్రమాన్ని కూడా గోప్యంగా జరిపించేశారు.

ADVERTISEMENT

రాజమౌళి, మహేష్ బాబు దంపతులు, కీరవాణి మరికొద్ది మంది యూనిట్ సభ్యులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ ఏప్రిల్-మే నెలలో మొదలుపెట్టాలని అనుకున్నప్పటికీ, పూరోహితుల సూచన మేరకు ద్వితీయ విగ్నం లేకుండా ఉండేందుకు విజయవాడ శివారులో వేసిన ఓ సెట్‌లో ఒకటి రెండు సన్నివేశాలు చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది.

గత ఏడాది మహేష్ బాబు నటించిన గుంటూరు కారం పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో అభిమానులు చాలా నిరాశ చెందారు.

రాజమౌళి సినిమా అంటే సూపర్ డూపర్ హిట్ మాత్రమే కాదు… అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా లభిస్తుంది. కనుక మహేష్ బాబు అభిమానులు ఈ సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వారి సహనాన్ని పూర్తిగా పరీక్షించిన తర్వాత రాజమౌళి షూటింగ్‌ మొదలుపెడుతున్నారు. కనీసం ఇప్పటికైనా సినిమా మొదలు పెట్టినందుకు వారు సంతోషిస్తున్నారు.

కానీ రాజమౌళి సినిమా అంటే కనీసం 2-3 ఏళ్ళ వ్యవహారం. అందునా ఎస్ఎస్‌ఎంబీ29 వర్కింగ్ టైటిల్‌తో మొదలుపెడుతున్న ఈ సినిమా వెయ్యి కోట్ల భారీ బడ్జెట్‌తో జాతీయ, అంతర్జాతీయ నటీనటులు, సాంకేతిక నిపుణులతో సాహసయాత్ర స్టోరీతో తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాని 2027లో విడుదల కావచ్చని చెపుతున్నప్పటికీ, మరో ఏడాది ఎక్కువే కావచ్చు కానీ ముందుగా మాత్రం పూర్తవదని అందరికీ తెలుసు.

గుంటూరు కారం (2024, జనవరి)లో రిలీజ్ కాగా ఇప్పుడు ఈ ఎస్ఎస్‌ఎంబీ29కి మరో రెండు మూడేళ్ళు పోతుంది. అంటే దాదాపు 4 ఏళ్ళపాటు మహేష్ బాబు సినిమాలు ఉండవన్న మాట. అంతేకాదు రాజమౌళి రూల్స్ ప్రకారం అంతవరకు మహేష్ బాబు ఎవరికీ కనపడకుండా మాయం అయిపోతారు కూడా.

ఈ రెండూ అభిమానులు జీర్ణించుకోవడం కష్టమే. కానీ పండంటి బిడ్డ కోసం పురిటి నొప్పులు తప్పవన్నట్లు రాజమౌళి సినిమాతో తమ అభిమాన హీరో మహేష్ బాబు అంతర్జాతీయ స్థాయికి ఎదగబోతున్నారు కనుక ఓపిక పట్టాల్సిందే.

పెద్ద హీరోలందరూ రెండు మూడేళ్ళకు లాక్ అయిపోతుండటం వలన చిన్న సినిమాలకు, చిన్న హీరోలకు ఇండస్ట్రీలో సెటిల్ అయ్యేందుకు చక్కటి అవకాశం లభిస్తోంది కూడా. కనుక అంతా మన మంచికే అని సరిపెట్టుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories