చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా మంచి సినిమాలకు ఎప్పుడూ పెద్దపీట వేసి తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించే టాలీవుడ్ ‘దర్శకధీరుడు’ రాజమౌళి, మరోసారి సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు. నందమూరి నటసింహం నటించిన 100వ సినిమా “గౌతమీపుత్ర శాతకర్ణి” గురించి తన అనుభూతులను తెలియజేస్తూ చిత్ర యూనిట్ సభ్యులపై ప్రశంసల జల్లు కురిపించారు.
సాహూ ‘బసవతారక పుత్ర’ బాలకృష్ణ… శాతకర్ణి పాత్రను పోషించిన మీకు సెల్యూట్ చేస్తున్నా, నందమూరి తారక రామారావు గారు గర్వపడే విధంగా అభినయించారు. ఖచ్చితంగా ఆయన ఆశీర్వాదాలు మీపై ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా గల 12 కోట్ల తెలుగు ప్రజల ఆశీర్వాదాలు నీపై ఉంటాయి ‘అంజనీపుత్ర’ క్రిష్ అంటూ దర్శకుడిని ఆకాశంలోకి ఎత్తేసారు. ఈ ‘ఎపిక్’ చిత్రాన్ని 79 రోజుల్లో ఎలా పూర్తి చేసావు, నిజంగా నమ్మలేకపోతున్నా, నీ దగ్గర ఖచ్చితంగా నేను నేర్చుకోవాలి… అంటూ రాజమౌళి చేసిన వ్యాఖ్యలు నందమూరి అభిమానుల్లో పండగ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి.
బుర్రా సాయి మాధవ్ రాసిన డైలాగ్స్ శాతకర్ణి కత్తిలా పదునైనవిగా ఉన్నాయని, అద్భుతమైన కెమెరా వర్క్, అత్యధ్బుతమైన ప్రొడక్షన్ విలువలతో “గౌతమీపుత్ర శాతకర్ణి” చిత్రం, తెలుగు ప్రజల గుండెల్లో కలకాలం గుర్తుండిపోయే చిత్రంగా నిలుస్తుందని రాజమౌళి అభిప్రాయపడ్డారు. జక్కన్న భావాలు ఎప్పుడూ సగటు ప్రేక్షకుడికి దగ్గరగా ఉంటాయని చెప్పడంలో సందేహం లేదు. దీంతో ఈ సంక్రాంతికి నందమూరి నటసింహం తన సత్తా చూపినట్లేనని అభిమానులు అసలు పండగ చేసుకుంటున్నారు.



