‘బాహుబలి – ది బిగినింగ్’ విడుదలైన తర్వాత ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?’ అన్న ప్రశ్న దేశవ్యాప్తంగా ఎలా హల్చల్ చేసిందో, ‘బాహుబలి – ది కన్ క్లూజన్’ విడుదలైన తర్వాత ‘రాజమౌళి దర్శకత్వంలో నటించే నెక్స్ట్ హీరో ఎవరు?’ అన్నది కూడా అంతే హాట్ టాపిక్ గా మారింది. ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న జక్కన్న తదుపరి హీరోపై బాలీవుడ్ హీరోలతో సహా అనేక పేర్లు వినిపించాయి. దీనిపై జవాబు దాటవేస్తూ వచ్చిన రాజమౌళి ఎట్టకేలకు హీరోను ఫిక్స్ అయ్యారా? అంటే…
ట్రేడ్ వర్గాల నుండి ‘అవుననే’ సమాధానం లభిస్తోంది. ఇప్పటికే రాజమౌళి – విజయేంద్రప్రసాద్ లు ఓ లైన్ అనుకోగా, పూర్తి స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగానే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. డివివి దానయ్య బ్యానర్ లో నిర్మించబోయే ఈ సినిమాలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ ను ఫిక్స్ అయినట్లుగా ట్రేడ్ వర్గాల టాక్. ‘స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ’ వంటి కమర్షియల్ హిట్స్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రాజమౌళి – తారక్ జోడి అంటే ట్రేడ్ వర్గాలలో ఉన్న క్రేజ్ తెలియనిది కాదు.
దీంతో ఈ సినిమాను ఏ కధతో తెరకెక్కిస్తారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ‘బాహుబలి’ని కొట్టే సినిమాగా తయారు చేస్తారా? లేక ఫక్తు కమర్షియల్ సినిమాను అందిస్తారా? ఏది ఏమైనా జక్కన్న మాత్రం తారక్ వైపుకే మొగ్గు చూపారని బలంగా వినపడుతున్న వార్త. మరో వైపు జూనియర్ ఎన్టీఆర్ కూడా “జై లవకుశ” సినిమాను మరియు ‘బిగ్ బాస్’ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సి ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్ళే అవకాశం కనపడుతోంది.



