‘బాహుబలి’ సినిమాతో ఇండియాలో ఉన్న రికార్డులన్నీ బద్దలు కొట్టిన రాజమౌళి, త్వరలో చైనాపై దండయాత్ర చేయనున్నారు. అన్నీ అనుకూలిస్తే… ‘పీకే’ పేరుతో ఉన్న చైనా రికార్డులు కూడా ‘బాహుబలి’ దెబ్బకు మటుమాయం కావచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అలా ప్రపంచ వ్యాప్తంగా ‘జక్కన్న’ పేరు మారుమ్రోగుతోంది.
మరో వైపు ‘బాహుబలి – ది కన్ క్లూజన్’ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాదిలో విడుదల ఉంటుందని తొలుత ప్రకటన ఇచ్చినప్పటికీ, 2017లోనే ముహూర్తం అంటూ సినీవర్గాలు ధృవీకరిస్తున్నాయి. అయితే ‘బాహుబలి – ది కన్ క్లూజన్’ సినిమాకు ఓ ప్రత్యేకత సంతరించుకోనుంది.
నేడు రాజమౌళికి భారత ప్రభుత్వం ప్రకటించిన ‘పద్మశ్రీ’ పురస్కారం పేరు పడబోయేది ‘బాహుబలి – ది కన్ క్లూజన్’ సినిమాలోనే. తెలుగు కీర్తిని, ఇండియన్ సినిమా స్టామినాను చాటి చెప్పిన రాజమౌళికి ‘పద్మశ్రీ’ అవార్డు రావడానికి ప్రధాన కారణం ‘బాహుబలి’ సినిమానేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి అంతటి సినిమాకు ముగింపు పలుకబోతున్న ‘బాహుబలి – ది కన్ క్లూజన్’ సినిమా టైటిల్స్ లో ‘జక్కన్న’ పేరు ‘పద్మశ్రీ’ రాజమౌళిగా పడబోతుండడం అభిమానులకు ఆనందదాయకమే కదా!





