తలైవార్ ‘కబాలి’ అమెరికాలో సంచలనంగా మారింది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అమెరికాలో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. 400 థియేటర్లలో ఈ నెల 22న విడుదల కాబోతున్న ఈ సినిమాకి ప్రీమియర్ షోలు కూడా భారీగా వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సినీ గెలాక్సీ “కబాలి” సినిమాను అమెరికాలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తోంది.
‘కబాలి’ టికెట్ల బుకింగ్ అమెరికాలో ఇప్పటికే మొదలైందని, మొదటి రెండు గంటల్లోనే రికార్డు స్థాయి టికెట్లు అమ్ముడుపోయాయని ‘సినీ గెలాక్సీ’ అధినేత మధు గార్లపాటి తెలిపారు. ప్రీమియర్ షో టికెట్ ధరను 25 డాలర్లుగా నిర్ణయించినట్టు చెప్పారు. ఇటీవల విజయ్ ‘థేరీ,’ సూర్య ‘24’ చిత్రాలను కూడా ‘సినీ గెలాక్సీ’ సంస్థే అమెరికాలో విడుదల చేసింది. తెలుగు, తమిళం రెండు భాషల్లోనూ “కబాలి” సినిమాను యుఎస్ లో రిలీజ్ చేస్తుండటం విశేషం. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీ జోడీగా రాధికా ఆప్టే నటిస్తోంది.



