మెగాస్టార్ చిరంజీవి నుండి పుణికిపుచ్చుకున్న సినీ వారసత్వంతో పాటు పలు వ్యాపారాలను కూడా రామ్ చరణ్ విజయవంతంగా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. మరో పక్కన సినీ నిర్మాతగా కూడా తన తండ్రితోనే సినిమాలు నిర్మిస్తోన్న చెర్రీ, త్వరలోనే మరో కొత్త అవతారం ఎత్తబోతున్నాడని తెలుస్తోంది. త్వరలోనే ఒక స్టూడియోకు అధినేత అయ్యేందుకు చెర్రీ సన్నాహాలు చేస్తున్నట్లుగా సమాచారం.
ఇండస్ట్రీలో ఉన్న పెద్ద కుటుంబాలన్నింటికి ఓ స్టూడియో ఉన్న విషయం తెలిసిందే. నందమూరి ఫ్యామిలీకి రామకృష్ణా స్టూడియోస్, ఘట్టమనేని ఫ్యామిలీకి పద్మాలయా స్టూడియో, దగ్గుపాటి కుటుంబానికి రామానాయుడు స్టూడియో, అక్కినేని ఫ్యామిలీకి అన్నపూర్ణ స్టూడియో ఉన్న దరిమిలా మెగా ఫ్యామిలీకి లోటుగా ఉన్న స్టూడియో నిర్మాణం చేపట్టేందుకు మెగా పవర్ స్టార్ కంకణం కట్టుకున్నట్లుగా తెలుస్తోంది.
అయితే ఈ స్టూడియో నిర్మాణం హైదరాబాద్ లో చేయాలా? లేక విశాఖలో చేయాలా? అన్న దానిపై తర్జనభర్జనలు పడుతున్నారని, త్వరలోనే దీనిపై కూడా ఓ స్పష్టత రానుందని సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్ లో ‘సైరా’ షూటింగ్ జరుగుతోన్న 22 ఎకరాల సెట్ లోనే స్టూడియో నిర్మాణం జరపాలన్నది ఒక ప్రతిపాదన కాగా, విశాఖలో గంటా వారి సౌజన్యంతో 20 ఎకరాల్లో స్టూడియో ఏర్పాటు చేయాలన్నది మరో ప్రతిపాదన.



