వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పది రోజులకు ఒక్క సినిమా చొప్పున ప్రకటిస్తూ వెళ్తున్నాడు. తాజాగా ఈయన ‘ఆంధ్రా సీఎం కిడ్నాప్’ అంటూ ఒక సినిమాను తెరకెక్కిస్తాను అంటూ వర్మ ప్రకటించాడు. ఈ సినిమాకు ట్యాగ్‌లైన్‌గా ‘తెలంగాణ సీఎం సస్పెక్టెడ్’ అంటూ పెట్టబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని స్వయంగా వర్మ ట్విట్టర్‌లో ప్రకటించాడు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెళ్లడిస్తాను అంటూ వర్మ పేర్కొన్నాడు.
వర్మ ఇలాంటి సినిమాలు ఎన్నో ప్రకటించాడు. దాంతో ఆయన అభిమానులు మరియు తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా వస్తుందని నమ్మడం లేదు. కాని వైవిధ్యభరితంగా టైటిల్ ఉండటంతో ఈ సినిమాను వర్మ తెరకెక్కిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. వర్మ ఏ మూడ్‌లో ఉండి ఈ టైటిల్‌ను, ఈ సినిమాను ప్రకటించాడో కాని ప్రస్తుతం అందరి దృష్టి ఈ సినిమాపై ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభేదాలు ఈ సినిమాకు తప్పకుండా ఉపయోగపడుతాయని కొందరు అంటున్నారు. ప్రస్తుతం ‘కిల్లింగ్ వీరప్పన్’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే పనిలో వర్మ ఉన్నాడు. ఆ తర్వాత ఈ సినిమాను వర్మ మొదలు పెడతాడేమో చూడాలి. ఇక ఈ సినిమా ఒక వేళ వస్తే సెన్సార్ నుండి ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది కూడా ఆసక్తికరంగా ఉంది.





