అమరావతిలో బ్రిటన్ విద్యాసంస్థ.. నేడే శంకుస్థాపన

Bedford School international campus in Amaravati

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో శంకుస్థాపనలు, నిర్మాణాలు నిత్యకృత్యం అయ్యాయంటే అతిశయోక్తి కాదు. తాజాగా బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత బెడ్‌ఫోర్డ్ స్కూల్ నిర్మాణానికి నేడు (ఆదివారం) భూమిపూజ కార్యక్రమం జరగబోతోంది.

దీనికి తుళ్ళూరు సమీపంలో ప్రభుత్వం ఎనిమిది ఎకరాల స్థలం కేటాయించగా దానిలో బెడ్‌ఫోర్డ్ రెండు దశల్లో రూ.100 కోట్లకు పైగా పెట్టుబడితో ఈ అంతర్జాతీయ విద్యాసంస్థను ఏర్పాటు చేస్తోంది. 2028 ఏప్రిల్‌లోగా నిర్మాణపనులు పూర్తి చేసి, వెంటనే తరగతులు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ADVERTISEMENT

దాదాపు 500 ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ బెడ్‌ఫోర్డ్ స్కూల్ భారత్‌లో తన రెండో క్యాంపస్‌ ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు దీనిని దక్కించుకునేందుకు చాలా రాష్ట్రాలు పోటీ పడ్డాయి. కానీ అత్యంత ప్రతిష్టాత్మకైన ఈ విద్యాసంస్థ అమరావతిని ఎంచుకుంది.

హైదరాబాద్ ఎడ్యుకేషనల్ అకాడమీ, మా లక్ష్మి గ్రూప్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. ఈ పాఠశాలలో కేంబ్రిడ్జి, ఐజీసీఎస్‌ఈ పాఠ్య ప్రణాళికలతో విద్యాబోధన అందించనున్నారు. నిర్మాణం పూర్తయిన తర్వాత 1,200 నుంచి 1,500 మంది విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్య అందించేలా క్యాంపస్‌ను అభివృద్ధి చేయనున్నారు.

కానీ ఇతర నగరాల్లోని అంతర్జాతీయ పాఠశాలలతో పోలిస్తే సగం ఫీజుకే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తామని హైదరాబాద్ ఎడ్యుకేషనల్ అకాడమీ, మా లక్ష్మి గ్రూప్ చైర్మన్ హరీష్ చంద్ర ప్రసాద్ యార్లగడ్డ వెల్లడించారు.

అమరావతిలో ఏర్పాటవుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, వాటి కార్యాలయాలు, క్వాంటం వ్యాలీ వంటి వాటితో రాబోయే రోజుల్లో దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో ఉద్యోగులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు వస్తారు.

కనుక అప్పుడు ఇలాంటి ఉన్నత సంస్థల కోసం పరుగులు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇప్పటి నుంచే భవిష్యత్‌ అవసరాలకు తగ్గటుగా అమరావతిలో ఏర్పాటు చేస్తుండటం చాలా అభినందనీయం.

ADVERTISEMENT
Latest Stories