రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పారిశ్రామిక రంగంలో రాయలసీమను అగ్రస్థానంలో నిలుపుతోంది. తాజాగా సీమలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లు పారిశ్రామిక హబ్‌లో ప్రముఖ పారిశ్రామిక సంస్థ రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఏర్పాటు చేసిన పానీయాల తయారీ పరిశ్రమ ఇటీవల ఉత్పత్తి ప్రారంభించింది.
గత ఏడాది నవంబర్‌లో సీఎం చంద్రబాబు నాయుడు ఈ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. కేవలం 12 నెలల్లోనే నిర్మాణ పనులు పూర్తి చేసి ఉత్పత్తిని ప్రారంభించడం విశేషం.
ఈ ప్లాంట్‌లో క్యాంపా కోలా (కూల్ డ్రింక్స్)తో పాటు వివిధ రకాల పండ్ల రసాలు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ తయారు చేస్తారు. దీనిలో స్థానిక యువతకు ప్రత్యక్షంగా ఉద్యోగాలు, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణం, వేగవంతమైన అనుమతుల ప్రక్రియకు ఈ ప్రాజెక్టు నిదర్శనమని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు.
సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా చేసినవారిలో పలువురు రాయలసీమకు చెందినవారే. వారిలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుత విభజిత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు.
కానీ రాయలసీమలో ఈ రెండున్నరేళ్ళలో జరిగినంత అభివృద్ధి దశాబ్దాలుగా జరుగలేదు. ఈ రెండున్నరేళ్ళలోనే సీమ జిల్లాలకు తాగు,సాగునీరు, వేలకోట్లతో అనేక పరిశ్రమలు ఏర్పాటు అయ్యాయి. త్వరలోనే కర్నూలులో హైకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు కాబోతోంది.
అటు తిరుపతి నుంచి ఇటు నెల్లూరు, కడప, కర్నూలు వరకు అనేక పరిశ్రమలు, వాటి కోసం పారిశ్రామికవాడలు ఏర్పాటవుతున్నాయి. అలాగే రామయపట్నం పోర్టు, కర్నూలులో డ్రోన్ హబ్, ఎయిర్ పోర్టు వంటివి అనేకం ఏర్పాటు అవుతునాయి.
ఇప్పుడు రిలయన్స్ కంపెనీ కూడా కర్నూలుకు తరలివచ్చింది. రాబోయే రెండున్నరేళ్ళలో మరిన్ని వస్తాయి. అప్పుడు దేశంలో, వివిధ రాష్ట్రాల నుంచి, రాష్ట్రంలో ఇతర జిల్లాల నుంచి రాయలసీమకే వలసలు మొదలైనా ఆశ్చర్యం లేదు.
ఒకవేళ రాష్ట్ర విభజన జరగకుండా ఉంటే బహుశః నేటికీ రాయలసీమ పరిస్థితి అలాగే ఉండేదేమో. కనుక రాష్ట్ర విభజన రాయలసీమకు వరంగా మారిందని చెప్పవచ్చు.





