మాజీ నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు ఈరోజు వీఐపీ బ్రేక్ దర్శనం సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దర్శనం తరువాత ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన జగన్ పరిపాలన బాగుందని కితాబు.. నవరత్నాలు పధకానికి నిధుల కొరత ఉన్నది. కేంద్రం జగన్ ప్రభుత్వానికి సహకరించడం లేదని చెప్పుకొచ్చారు. అలాగే తాను పార్టీ మారడంపై ఇప్పటిదాకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు ఆయన.
అయితే ఈ వ్యాఖ్యలు పలువురిని ఆశ్చర్యపరచింది. కొన్ని రోజుల క్రితం బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ రాయపాటి ఇంటికి వెళ్లి మరీ మంతనాలు జరిపారు. ఆయన బీజేపీలో చేరడం దాదాపుగా ఖాయమని అంతా అనుకున్నారు. ఇప్పుడు ఆయన జగన్ కు అనుకూలంగా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటం దేనికి సంకేతం అన్నట్టు అంతా చర్చించుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టును ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలోనే రాయపాటి స్వరం మారిందా? అని అంతా అనుకుంటున్నారు.
రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ పోలవరం కాంట్రాక్టును తొలుత దక్కించుకుంది. అయితే ఆ కంపెనీ ప్రాజెక్టును పూర్తి చేసే సత్తా లేకపోవడంతో సబ్ కాంట్రాక్టర్లను రంగంలోకి దించారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు వారిని కూడా తప్పించి కొత్త టెండర్లను పిలుస్తుంది జగన్ ప్రభుత్వం. ఈ క్రమంలో రాయపాటి జగన్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారా? ఇటీవలే జరిగిన ఎన్నికలలో రాయపాటి తో పాటు ఆయన సపోర్టు చేసిన అభ్యర్థులు కూడా ఓడిపోవడం గమనార్హం.



