ఈ కేసులన్నీ ఉపయోగపడని దివ్యాస్త్రాలుగా మిగిలిపోతాయా?

Revanth Reddy BRS cases investigation

అధికార పార్టీలు తమ రాజకీయ ప్రత్యర్ధులపై నమోదు చేసే కొన్ని పెద్ద కేసులు దివ్యాస్త్రాల వంటివే. వాటిని అవసరమైనప్పుడు వారిపై ప్రయోగించి కట్టడి చేయవచ్చు. అలాగే సీఎం రేవంత్‌ రెడ్డి చేతిలో కూడా దివ్యాస్త్రాల వంటి ఫోన్‌ ట్యాపింగ్‌, కాళేశ్వరం, ఎఫ్‌-1 రేసింగ్‌, ధరణి, విద్యుత్‌ కొనుగోళ్ల వ్యవహారాలపై కేసులున్నాయి.

కానీ వాటిని ఇంతవరకు ఉపయోగించుకోలేదు… తొందర పడటం లేదు. పడితే ఆయన కూడా ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిలా డెబ్బయిపోయే ప్రమాదం ఉంటుంది.

ADVERTISEMENT

కనుక చట్ట ప్రకారమే ముందుకు సాగుతూ కమిషన్లు, సిట్‌లు వేసి విచారణలు జరిపించారు. కొన్నిటి విచారణ ఇంకా సాగుతూనే ఉంది. కానీ ఏ ఒక్క కేసు తుది దశకు చేరుకోలేదు.

ఈ కారణంగా బీఆర్‌ఎస్‌ అగ్రనేతలపై సీఎం రేవంత్‌ రెడ్డి అనేక ఆరోపణలు చేస్తున్నప్పటికీ, వారిని టచ్‌ చేసే పరిస్థితి లేదు. కనుక నేటికీ బీఆర్‌ఎస్‌ పార్టీ చాలా ద్రుడంగానే ఉందని భావించవచ్చు.

కానీ త్వరలో ఈ ఫోన్ ట్యాపింగ్‌ కేసులో అనూహ్య పరిణామాలు జరుగుతాయని, వాటితో రాష్ట్ర రాజకీయాలు మారుతాయని ఇటీవల సీఎం రేవంత్‌ రెడ్డి స్వయంగా చెప్పారు.

ఆ తర్వాత ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును చూస్తున్న హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ను బదిలీ చేసి, ఆయన స్థానంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తారనే పేరున్న ఐపీఎస్‌ అధికారి మహేశ్‌ భగవత్‌ను నియమించారు. అప్పటి నుంచే ఈ మార్పు ఆ కేసు కోసమేనని ఊహాగానాలు మొదలయ్యాయి.

అయినా కూడా ఈ కేసుల్లో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌ రావు ముగ్గురిని అరెస్ట్‌ చేసి జైలుకు పంపించినంత మాత్రాన ఒరిగేదేమీ ఉండదు. వారు బెయిల్‌పై బయటకు వచ్చేసి ప్రజల మధ్యకు వెళ్తే వారికే ప్రజల సానుభూతి లభిస్తుంది. అప్పుడు సీఎం రేవంత్‌ రెడ్డి కూడా మాజీ సీఎం జగన్మోహన్‌ రెడ్డిలా రాజకీయంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది.

కనుక ఈ కేసుల్లో వారికి వ్యతిరేకంగా బలమైన ఆధారాలు లభించి, చట్టపరమైన చర్యలు తీసుకునే పరిస్థితి వస్తే, అప్పుడు తప్పకుండా తెలంగాణ రాజకీయాలు అనూహ్యంగా మారిపోతాయి.

అయితే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఇప్పటికే మూడేళ్ళు. మరో ఏడాది తర్వాత రాష్ట్రంలో మెల్లగా శాసనసభ ఎన్నికల హడావుడి మొదలవుతుంది. కనుక అప్పుడు వారిని టచ్‌ చేయడం రాజకీయంగా కాంగ్రెస్‌ పార్టీకి చాలా నష్టం కలిగించవచ్చు.

కనుక ఇప్పటికీ ఈ కేసులలో పురోగతి సాధించలేకపోతే నాడు కురుక్షేత్ర సంగ్రామంలో కర్ణుడుకి సమయానికి దివ్యాస్త్రాలు పనికి రాకుండా పోయినట్లుగానే, ఇవి కూడా సీఎం రేవంత్‌ రెడ్డి నిరుపయోగంగా మిగిలిపోవచ్చు.

కనుక ఈ దివ్యాస్త్రాలను సీఎం రేవంత్‌ రెడ్డి ఉపయోగించుకొని ప్రత్యర్ధులపై మళ్ళీ విజయం సాధించగలరా?లేక ఇవి నిరుపయోగంగా మిగిలిపోతాయా? అనేది రాబోయే రోజుల్లో చూస్తాం.

ADVERTISEMENT
Latest Stories