రేవంత్‌ ఏం మాయ చేస్తారో?

Revanth Reddy Launches Abhaya Hastham Poster

తెలంగాణ ఎన్నికలలో కేసీఆర్‌ని, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవికి పోటీ పడిన సీనియర్లను అందరినీ మట్టి కరిపించి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు రేవంత్‌ రెడ్డి. ఆనాడు బీజేపీలో నరేంద్రమోడీ ఏవిదంగా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటూ ప్రధాని అయ్యారో, రేవంత్‌ రెడ్డి కూడా సరిగ్గా ఆలాంటి వ్యతిరేకతని, బలమైన రాజకీయ శక్తులను ఎదుర్కొని కాంగ్రెస్‌ని గెలిపించుకొని తనను తాను కూడా గెలిపించుకొన్నారు.

అయితే రేవంత్‌ ప్రభుత్వం మనుగడకు 60 మంది ఎమ్మెల్యేలు అవసరం కాగా 64 మంది మాత్రమే ఉన్నారు. కనుక వారిలో ఓ ఐదుగురు ఎమ్మెల్యేలు తప్పుకొంటే ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం పొంచి ఉంది. దీని కోసం కేసీఆర్‌ కాసుకుకూర్చోన్నారు. ఒకవేళ రేవంత్‌ రెడ్డి ఏదోవిదంగా బిఆర్ఎస్ నుంచే ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి రప్పించుకొన్నా మరో రూపంలో గండం పొంచి ఉంది. అదే… ఆరు గ్యారెంటీలు.

ADVERTISEMENT

ఎన్నికలలో గెలిచేందుకు కాంగ్రెస్‌ పార్టీ తరపున ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఇప్పుడు రేవంత్‌ ప్రభుత్వం మెడకు గుదిబండలా మారాయని చెప్పక తప్పదు. పైగా సినిమా రిలీజ్ డేట్ ముందే ప్రకటించేసిన్నట్లు కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోగా వాటన్నిటినీ అమలుచేస్తామని పదేపదే హామీ ఇవ్వగా అప్పుడే ఒక నెల గడిచిపోతుండటంతో బిఆర్ఎస్ పార్టీ వాటి గురించి నిలదీయడం మొదలుపెట్టింది.

కనుక దీనికి తరుణోపాయంగా సిఎం రేవంత్‌ రెడ్డి, ఆయన మంత్రులు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నుంచి ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజావాణిలో గ్రామసభలు నిర్వహించి ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని చెపుతున్నారు. అలాగే ఆరు గ్యారెంటీ పధకాలకు దరఖాస్తులు కూడా సమర్పించవచ్చని చెపుతున్నారు.

కానీ వాటిని పొందాలంటే తెల్ల రేషన్ కార్డులు తప్పనిసరి అని మెలికపెట్టారు. కనుక తెల్ల రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోమని కూడా సూచించారు. కానీ చావు కబురు చల్లగా చెప్పమన్నట్లు వాటి జారీకి అనుసరిస్తున్న నియమనిబందనలు మార్చబోతున్నట్లు మెల్లగా చెప్పారు.

అందుకు ఓ కారణం కూడా చెప్పారు. ఇప్పటికే లక్షల మంది అనర్హులకు తెల్ల రేషన్ కార్డులు మంజూరయ్యాయని, ఆ కారణంగా అర్హులకు కార్డులు లభించడం లేదని చెప్పారు. కనుక తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేసే విధానంపై అధ్యయనం చేసిన తర్వాతే కార్డులు మంజూరు చేస్తామని చల్లగా చెప్పారు.

అంటే ఆరు గ్యారెంటీల కధ రాజుగారు ఏడు చేపల కధలా సాగబోతోందన్నమాట! కానీ ఆరు గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్‌ మాట తప్పితే అప్పుడు కూడా ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించవచ్చు ఫిరాయిస్తే రేవంత్‌ ప్రభుత్వం ప్రమాదంలో పడవచ్చు. కనుక రేవంత్‌ ఏం మాయచేస్తారో? చూద్దాం.

ADVERTISEMENT
Latest Stories