పార్టీలో సీనియర్లను రేవంత్‌ భలే సైడ్ చేశారే

MLA Seethakkaతెలంగాణలో బిజెపికి బండి సంజయ్‌ ఏవిదంగా జీవం పోసి బిఆర్ఎస్‌కి ప్రత్యామ్నాయంగా ఎదిగేలా చేశారో, రేవంత్‌ రెడ్డి కూడా కాంగ్రెస్‌ పార్టీని అలాగే బలోపేతం చేశారు. ఇప్పుడు ఎన్నికలలో గెలిచే అవకాశం కనిపిస్తున్నప్పుడు, తనే ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకోవడం సహజం. అయితే పిసిసి అధ్యక్షుడుగానే తన నాయకత్వాన్ని అంగీకరించని పార్టీలో సీనియర్లు రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారంటే చూస్తూ ఊరుకొంటారా? ఊరుకోరు కనుక రేవంత్‌ రెడ్డి తెలివిగా చక్రం తిప్పారు. అదీ… అమెరికాలో తానా మహాసభలకు వెళ్ళినప్పుడు అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రతిపాదించడం విశేషం.

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే దళితవర్గానికి చెందిన ములుగు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని రేవంత్‌ రెడ్డి అన్నారు.

ADVERTISEMENT

దీంతో పార్టీలో సీనియర్ల నోటమాట రావడం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో బడుగు బలహీనవర్గాల ప్రజలు సీతక్కను సొంత కుటుంబ సభ్యురాలిగా ప్రేమిస్తుంటారు. కరోనా, లాక్ డౌన్‌ కష్టకాలంలో, వరదలు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఆమె దళితులు, గిరిజనులు, మారుమూల గ్రామాలలో నివసించేవారికి ఆమె ఎనలేని సేవలు చేశారు.

తెలంగాణ ఏర్పడితే మొట్టమొదట దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీఆర్‌, ఎన్నికలలో గెలిచిన తర్వాత మాట తప్పి ఆ పదవి తాను చేపట్టడమే కాక, తన తర్వాత తన కుమారుడు కేటీఆర్‌ని ఆ కుర్చీలో కూర్చోబెట్టాలనుకొంటున్నారు. కనుక సీతక్కను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించి ఎన్నికలకు వెళితే కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలు గణనీయంగా పెరుగుతాయి.

సీతక్క మారుమూల గ్రామంలో నిరుపేద దళిత కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ఉన్నత విద్యావంతురాలు. మృధుస్వభావి. చాలా స్నేహశీలి. అత్యంత ప్రజాధారణ ఉన్న నేతలలో ఒకరు. కనుక సీతక్కను రాహుల్ గాంధీ కూడా చాలా అభిమానిస్తారు. పార్టీ ఎమ్మెల్యేలలో, మహిళా నేతలలో ఆమెను అత్యుత్తమైనవారిగా పరిగణిస్తుంటారు. కనుక ఆమెను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించేందుకు ఆయన కూడా ఓకే చెప్పవచ్చు.

అన్నిటికీ మించి రేవంత్‌ రెడ్డి, ఆమె అక్కా, తమ్ముడు అని పిలుచుకొనే సాన్నిహిత్యం ఉంది. కనుక ఆమె ముఖ్యమంత్రి అయితే రేవంత్‌ రెడ్డి మాటే చెల్లుతుందని వేరే చెప్పక్కరలేదు. పైగా ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్నవారిలో రేవంత్‌ రెడ్డితో సహా చాలా మంది రెడ్లే. కనుక సీతక్క పేరును ప్రతిపాదించి తన పోటీ దారులందరినీ రేవంత్‌ రెడ్డి రేసులో నుంచి స్వయంగా తప్పుకోవలసిన పరిస్థితి కల్పించారని చెపొచ్చు.

అయితే ఇది కేవలం ప్రతిపాదన మాత్రమే. ఎన్నికలు జరిగేలోగా కాంగ్రెస్‌లో ఏమైనా జరుగవచ్చు. అన్నిటికంటే ముందుగా కొమ్ములు తిరిగిన కేసీఆర్‌ను, బిఆర్ఎస్ నేతలను కాంగ్రెస్‌ పార్టీ ఢీకొని ఓడించాల్సి ఉంటుంది. అయితే సీతక్క ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించి ఎన్నికల బరిలో దిగితే కాంగ్రెస్‌ విజయావకాశాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories