తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గూటికి వెళ్లినా ఇంకా తన పాత పార్టీ టీడీపీ పైన ప్రేమను వదులుకోలేదా.? లేక వదులుకోలేకపోతున్నారా.? అనే విధంగా ఒక్కోసారి రేవంత్ వ్యాఖ్యలు టీడీపీ సానుభూతిపరుల మనసు దోచుకుంటున్నాయి.
వీడు ఎక్కడున్నా మనవాడేరా అనేలా టీడీపీ మద్దతుదారుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ చేసిన కొన్ని వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రత్యర్దులలో ఇటువంటి అనుమానాలకే తెరలేపాయి.
ఈ తెలంగాణ రాష్ట్రంలో నందమూరి అభిమానులున్నారు, చంద్రబాబుకు సహచరులు, అనుచరులు ఉన్నారు, వారందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, తెలంగాణలో టీడీపీ పార్టీ పై, ఆ పార్టీ నాయకత్వం పై కక్షకట్టి మరి దెబ్బతీసిన కేసీఆర్ ని, బిఆర్ఎస్ పార్టీని సమూలంగా పాతిపెట్టినప్పుడే, ఊళ్ళల్లో బిఆర్ఎస్ దిమ్మలు కూలగొట్టినప్పుడే ఎన్టీఆర్ కి నిజమైన నివాళి అంటూ రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ టీడీపీ మద్దతుదారులతో జోష్ తెచ్చాయి.
అదేవిధంగా తెలంగాణ రాజకీయాలలో కొత్త చర్చకు తెరలేపాయి. అయితే కాంగ్రెస్ నాయకుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ టీడీపీ పార్టీ బలాన్ని తట్టి లేపడం పై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయటకొచ్చారు, అలాగే పనిలోపనిగా అటు రేవంత్ పైన ఇటు టీడీపీ పైన ఆ పార్టీ అధినేత బాబు పైన మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు.
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తిరిగి తన పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి చేస్తున్న పోరాటాలు, తెలంగాణలో కదుపుతున్న రాజకీయాలు ప్రత్యర్థి రేవంత్ పైనా.? లేక పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ తోనా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
రేవంత్ ని గద్దె దింపడానికి టీపీడీ ని తెరమీదకు తెస్తున్నారా.? లేక టీడీపీ ని టార్గెట్ చేయడానికి రేవంత్ ను ఆయుధంగా వాడుతున్నారా.? అనే స్థాయిలో కేటీఆర్ టీడీపీ పై రాజకీయం నడిపిస్తున్నారు. రాష్ట్ర విభజన తో తెలంగాణలో సమాదైనా టీడీపీ ని తిరిగి తెలంగాణ గడ్డ పైకి తెచ్చేందుకు రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నారని,
అందులో భాగంగానే రేవంత్ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈ రకమైన దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. అలాగే గత రెండేళ్లుగా తన పాత బాసు ఆదేశాలతోనే తెలంగాణలో పాలన చేస్తూ తెలంగాణ జల హక్కులను కాలరాస్తున్నారని, అసలు రేవంత్ రాష్ట్ర ముఖ్యమంత్రా.? లేక ముఠా నాయకుడా.? కాంగ్రెస్ నాయకుడా.? టీడీపీ సేవకుడా.? అంటూ కేటీఆర్, రేవంత్ పై రెచ్చిపోయారు.
అయితే, అసలు తెలంగాణ రాజకీయాలలో టీడీపీ ఉనికే లేదు, తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీనే లేదు, పార్టీ ఉన్నా నాయకులు లేరు, నాయకులున్నా వారిని నడిపించే నాయకత్వం లేదు అంటూ తెలంగాణ రాజకీయాల నుండి టీడీపీ పేరును చెరిపేసాం అని తొడలు కొట్టిన తెరాస, జబ్బలు చరిచిన బిఆర్ఎస్ ఇప్పుడు టీడీపీ చుట్టూ ఇంత రాజకీయం ఎందుకు నడుపుతున్నట్టు.?
అంటే తెలంగాణలో టీడీపీ బలం అంతర్గతంగా బహిర్గతమవుతుందా.? ఆ బలాన్ని తన వైపు తిప్పుకోవడానికి, తన పార్టీకి అనుకూలంగా మలచుకోవడానికి, టీడీపీ సానుభూతిపరులను ఎమోషనల్ గా టచ్ చేయడానికి రేవంత్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా.?
అలాగే టీడీపీ బలాన్ని బయటకు రానివ్వకుండా, ఆ పార్టీ జెండా తిరిగి తెలంగాణలో ఎగరకుండా చేయడానికే బిఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబ సభ్యులు టీడీపీ పై తెలంగాణ ద్రోహి అనే విష ప్రచారాన్ని తిరిగి తెరమీదకు తెస్తున్నారా.? అందుకు రేవంత్ ని ఒక అస్త్రంగా వాడుకుంటున్నారా.?
రేవంత్ – కేటీఆర్ మధ్యలో టీడీపీ అంటూ సాగుతున్న తెలంగాణ రాజకీయం వెనుక కంటికి కనిపించని ఆ బలం, బలహీనత రెండు బాబేనా.? తద్వారా వచ్చిన రిటర్న్ గిఫ్టేనా.? అంటే బిఆర్ఎస్ ప్రస్తుత పరిస్థితికి రేవంత్ పదవికి మధ్య పసుపు జెండా పవర్ ఉందన్న వాస్తవం ప్రత్యక్షంగా ఒకరు, పరోక్షంగా మరొకరు ఒప్పుకుంటున్నారా.? అందుకే తెలంగాణ రాజకీయాలు టీడీపీ చుట్టు తిరుగుతున్నాయా.?






