తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రెండేళ్ల పదవిని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి, ఇటు ఢిల్లీ అధిష్టానం ఆశీస్సులతో పాటుగా అటు రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల మద్దతు కూడా పుష్కలంగా పొందారు.
సహజంగా కాంగ్రెస్ పార్టీలో పదవుల కుమ్ములాటలు, అంతర్గత విభేదాలు, వ్యక్తిగత ప్రకటనలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కాంగ్రెస్ లో పదవులకన్నా నాయకులే ఎక్కువ అనే నానుడి కూడా బాగా ప్రచారంలో ఉంటుంది, ఆచరణలోనూ కనిపిస్తుంది కూడా.
అటువంటి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ తన హవా కొనసాగించగలుగుతున్నాడు అంటే అదొక అద్భుతమనే చెప్పాలి. అయితే ఆ అద్భుతం వెనుక రేవంత్ ఏళ్లనాటి కష్టం, ఓటమి ఒప్పుకొని పోరాటాలు ఎన్నో ఉన్నాయి.
అలాగే రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ కి తెలంగాణలో అధికారం దక్కడానికి పదేళ్ల సమయం పట్టడానికి కాంగ్రెస్ లో అందరు ఒక కారణం అయితే పదేళ్ల తరువాత కాంగ్రెస్ చేతికి అధికార పగ్గాలు దక్కడానికి మాత్రం ఏకైక కారణం కేవలం రేవంత్ రెడ్డి ఒక్కరే అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.
అటువంటి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో చేసిన కొన్ని ప్రకటనలు ఆసక్తిగా మారాయి. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ మీడియా చిట్ చాట్ లో పాల్గొని తెలంగాణకు “నేనే రాజు నేనే మంత్రి” నాకు ఎవరు పోటీ కాదు అంటూ కొన్ని హాట్ కామెంట్స్ చేసారు.
అలాగే రాష్ట్రంలో పదేళ్లు నేనే సీఎంగా ఉంటా అంటూ ధీమా వ్యక్తం చేసారు. అయితే పదేళ్లు నేనే సీఎం అంటూ రేవంత్ చేసిన ఈ ప్రకటన కాంగ్రెస్ లో రేవంత్ నాయాకత్వం పట్ల ఉన్న అసమ్మతి నేతలను ఉద్దేశించా, లేదా బిఆర్ఎస్ కు పంపిన ఒక హెచ్చరికా అనేది ఇక్కడ చర్చనీయాంశమగా మారింది.
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్లకు కొదవు ఉండదు, అలాగే ఈ మధ్య బొగ్గు టెండర్ ల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇద్దరు మంత్రుల పట్ల వచ్చి అభియోగాలు, అందులో రేవంత్ పాత్ర అంటూ జరిగిన ప్రచారాలు, అధికార పార్టీలో రేవంత్ వ్యతిరేకవర్గం అంటూ సాగిన కొన్ని కథనాలకు రేవంత్ తన ప్రకటనతో చెక్ పెట్టారా.?
లేదా బిఆర్ఎస్ ఇక రాబోయే రెండేళ్ల తరువాత తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు, కాంగ్రెస్ నాయకుల పని ఖతం, అధికారులు ప్రభుత్వ ఆదేశాలతో హద్దులు దాటితే వదిలే ప్రస్తక్తే లేదు అంటూ కేటీఆర్ చేస్తున్న ప్రకటనలకు రేవంత్ చేసిన వ్యాఖ్యలు కౌంటర్లా.?
తన ప్రకటనలతో కాంగ్రెస్ క్యాడర్లో భరోసా కల్పించడం తో పాటు పార్టీలో ఉన్న అంతర్గత రాజకీయాలకు చెక్ పెట్టాలని భావించారా.? అలాగే ప్రతిపక్ష బిఆర్ఎస్ నాయకులను హెచ్చరించాలని చూస్తున్నారా.?




