ప్రారంభోత్సవం తర్వాతే కొట్టుకుపోయిందిగా? చెపితే ఉక్రోషం దేనికి?

RK Beach Flaoting Bridge

వైసీపి ప్రభుత్వానికి కూల్చివేతలే తప్ప నిర్మాణాలు అసలు అచ్చి రావడం లేదు. కడప స్టీల్ ప్లాంట్‌కి పునాది వేస్తే నాలుగేళ్ళలో ప్రహారీ గోడ మాత్రమే కట్టగలిగారు. విశాఖలో ఋషికొండని చెక్కేసి దానిపై వందల కోట్లతో విలాసవంతమైన భవనం కట్టుకుంటే, దానిలో అడుగు పెట్టడానికి జగన్మోహన్‌ రెడ్డి సాహసించలేకపోతున్నారు.

ADVERTISEMENT

తాజాగా విశాఖ ఆర్‌కె బీచ్ వద్ద సుమారు కోటిన్నర ఖర్చు చేసి సముద్రంపై తెలియాడే ‘ఫ్లోటింగ్ బ్రిడ్జ్’ ఏర్పాటు చేసి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేత ఆదివారం ప్రారంభోత్సవం చేయిస్తే, మర్నాడే దానిలో సందర్శకులు నిలబడేందుకు ఏర్పాటు చేసిన ప్లాట్ ఫారం విడిపోయి సముద్రంలో కొంత దూరం కొట్టుకుపోయింది.

టిడిపి, జనసేనలు, మీడియా ఆ ఫోటోలు, వీడియోలను చూపిస్తూ విమర్శిస్తే, వైసీపి ప్రభుత్వానికి ఉక్రోషం పొడుచుకువస్తోంది.

సోమవారం బీచ్‌లో అలలు ఎక్కువగా ఉన్నందున నిర్వాహకులు సందర్శకులను అనుమతించలేదని, ఇటువంటి సమయంలో ప్లాట్ ఫారంపై సందర్శకులు ఉండగా ఒకవేళ అది వంతెన నుంచి విడిపోతే ఎటువంటి చర్యలు చేపట్టాలో తెలుసుకునేందుకు దాని నిర్వాహకులే ‘మాక్ డ్రిల్’లో భాగంగా దానిని విడదీసి పరీక్షిస్తుంటే, టిడిపి, జనసేనలు, వాటి మీడియా వంతెన కొట్టుకుపోయిందంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూ తమ ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయని వైసీపి ఆత్మసాక్షి ఆవేదన వ్యక్తం చేసింది.

మొన్న ఆదివారమే ప్రధాని నరేంద్రమోడీ ఏపీతో సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో రైల్వే వంతెనలు, గుజరాత్‌లోని ద్వారక-ఓఖా పట్టణాల మద్య దేశంలోకెల్ల అతి పొడవైన కేబిల్ బ్రిడ్జికి ప్రారంభోత్సవాలు చేశారు. వెంటనే అవన్నీ ప్రజలు వినియోగించుకుంటున్నారు. కానీ ఆదేరోజు వైవీ సుబ్బారెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభోత్సవం చేసిన కేవలం వంద మీటర్ల పొడవుండే ‘ఫ్లోటింగ్ బ్రిడ్జి’ మాత్రం కొట్టుకుపోయింది!

అది ‘మాక్ డ్రిల్’ అని వైసీపి ఆత్మసాక్షి, దాని నిర్వాహకులు సర్ధిచెప్పుకుంటున్నారు. ఓ రైల్వే ట్రాక్ లేదా ఫ్లైఓవర్‌ లేదా కేబిల్ బ్రిడ్జికి అన్ని పరీక్షలు చేసిన తర్వాత, అది సామాన్య ప్రజలు వినియోగించుకోవడానికి ‘సిద్దం’గా ఉందని, ఎటువంటి ప్రమాదమూ ఉండదని నిర్ధారించుకున్న తర్వాతే ప్రారంభోత్సవం చేస్తుంటారు.

మరి విశాఖలోని ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జికి ఏ పరీక్షలు నిర్వహించకుండానే వైవీ సుబ్బారెడ్డి కొబ్బరికాయ కొట్టేశారంటే నమ్మశక్యంగా ఉందా?కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆయన తన అనుచరులతో కలిసి దానిపై విహరించి వచ్చారు కదా?అంటే సందర్శకులు కూడా వినియోగించుకునేందుకు ‘సిద్దం’గా ఉందనే కదా అర్దం? కానీ ఇప్పుడు లేదంటున్నారు?అలాంటప్పుడు ఎందుకు ప్రారంభోత్సవం చేశారు? తర్వాత ప్లాట్ ఫారం వంతెన నుంచి విడిపోతే ‘మాక్ డ్రిల్’ అని కవరింగ్ దేనికి?

విశాఖ ఆర్‌కె బీచ్‌ వద్ద చాలా ఉదృతంగా కెరటాలు వస్తుంటాయి. అమావాస్య, పౌర్ణమి సమయంలో మరింత ఉదృతంగా ఉంటాయి. ఏటా అదే ప్రాంతంలో అనేకమంది సందర్శకులు సముద్రంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోతుంటారు.

కనుక అక్కడ సముద్రంలోకి వెళ్ళడం చాలా ప్రమాదామని హెచ్చరిక బోర్డులు పెట్టారు. సోమవారం సముద్రంలో ఉదృతంగా కెరటాలు వస్తున్నందునే సందర్శకులను అనుమతించలేదని చెపుతున్నారు. మరి అటువంటి ప్రమాదకరమైన చోట ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఏర్పాటు చేయడం దేనికి?ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం దేనికి?

అదృష్టవశాత్తు దానిపై నిన్న సందర్శకులు లేరు. ఒకవేళ ఉన్నప్పుడు అది ప్రధాన వంతెన నుంచి విడిపోయి సముద్రంలోకి కొట్టుకుపోతే?ఆ ఊహే భయంకరంగా ఉంది. ఆ ఊహ చాలా భయంకరంగా ఉంది కనుకనే బహుశః వైసీపి నేతలకి ఈ ఐడియా నచ్చిందేమో?

ADVERTISEMENT
Latest Stories