సినీ హీరోలను ఏ విధంగా అభిమానిస్తారో అందరికీ తెలిసిన విషయమే. తమ అభిమాన హీరోపై ఏ చిన్న రూమర్ వచ్చినా, అందులో నిజానిజాలు నిగ్గు తేలేటంత వరకు మనశ్శాంతి ఉండదు. అలాంటి అనుభూతే తాజాగా మలయాళ సూపర్ స్టార్ ముమ్ముట్టి అభిమానులు ఎదుర్కొంటున్నారు.
ముమ్ముట్టి ఆరోగ్యం క్షీణించిందని, ఆసుపత్రిలో చికిత్స తీసుకొంటున్నారని గత రెండు, మూడు రోజులుగా వార్తలు వచ్చిన నేపధ్యంలో అభిమానులు కంగారు పడ్డారు. ఆ రాష్ట్ర సిఎం వర్గాలు ముమ్ముట్టి ఆరోగ్యం గురించి వాకబు చేసేటంత వరకు ఈ వార్తలు చేరుకున్నాయి. అయితే తాజాగా వెలువడిన సమాచారం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను స్థిమిత పరిచింది.
షూటింగ్ బిజీలతో దూరప్రయాణాలు ఎక్కువవ్వడంతో ముమ్ముట్టి ఆరోగ్యం కలత చెందిందని, ఇటీవల దుబాయ్ నుండి ముంబైకు ప్రయాణించే సమయంలో కాస్త ఇబ్బంది పడ్డారని, అయితే మెడికల్ చెకప్ చేయించుకున్న తర్వాత బెంగళూర్ లో ఉన్న ఆమె కుమార్తె ఇంటిలో ముమ్ముట్టి విశ్రాంతి తీసుకొంటున్నారని తేలింది. ఈ వారం ముగిసిన తర్వాత యథావిధిగా సినిమా షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం. దీంతో సూపర్ స్టార్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.



