మెగా హీరో సాయి తేజ్ కొత్త సినిమా కొన్ని రోజుల క్రితం పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ‘ప్రస్థానం’ తో తెలుగు చిత్రసీమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దేవ కట్టాతో సాయి తేజ్ ఈ సినిమా చేస్తున్నాడు. దేవ కట్టాతో వస్తోన్న ఈ సినిమా ఆయన శైలిలోనే ఇంటెన్స్ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కబోతోందట.
ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ డాక్టర్ గా కనిపించబోతున్నాడట. అలాగే రమ్య కృష్ణ సీఎంగా కనిపించబోతున్నారట. కరోనా పరిస్థితులు చక్కబడితే వచ్చే నెల 20 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుందని సమాచారం. మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది.
ఆ తరువాత మే నెలలో ఒక నెల పాటు ఏలూరు, కొల్లేరు పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరపబోతున్నారు. మొత్తంగా జులై చివరన షూటింగ్ పూర్తి చెయ్యడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఆగస్టులో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఆరు ప్లాపుల తరువాత ప్రతిరోజు పండగే వంటి సూపర్ హిట్ తో మళ్ళీ తన సత్తా చాటాడు ఈ యువ హీరో.
ప్రస్తుతం మే 1న విడుదల కాబోయే (?) సోలో బ్రతుకే సో బెటర్ సినిమాపై కూడా ట్రేడ్ లో మంచి అంచనాలే ఉన్నాయి. ఇది ఇలా ఉండగా ఈ చిత్రం గురించి మరో ఆసక్తికరమైన విషయం ఫిలింనగర్ లో వినిపిస్తుంది. ఈ స్క్రిప్ట్ దేవ కట్టా పవన్ కళ్యాణ్ కోసం తయారు చేశాడట. రెండున్నర ఏళ్ల క్రితమే పవన్ కళ్యాణ్ కు వినిపించాడట. పవన్ కళ్యాణ్ కి నచ్చినా జనసేన పనులలో బిజీ అయిపోయి చెయ్యడం కుదర్లేదట. ఇప్పుడు చేద్దామన్నా టైం లేదట. దీనితో ఆ స్క్రిప్ట్ సాయి ధరమ్ తేజ్ దగ్గరకు పంపించాడని సమాచారం.





