సజ్జల సవాల్…అచ్చన్న జవాబు

Sajjala_Ramakrishna_Reddy-Kinjarapu_Atchannaiduఅమలాపురం అల్లర్ల వెనుక టిడిపి, జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు ఉన్నారని, వారే వెనకుండి ఈ విధ్వంసం సృష్టింపజేశారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు.

ADVERTISEMENT

సచివాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ, “కోనసీమ జిల్లాకు డా.అంబేడ్కర్ పేరు పెడదామనే సూచనకు వారు కూడా అంగీకరించారు. కానీ నిన్న జరిగిన అల్లర్లలో ఆ రెండు పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తూ శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్న వారే మా ప్రభుత్వం శాంతిభద్రతలను కాపాడటంలో విఫలమైందని ఆరోపిస్తుండటం చాలా విడ్డూరంగా ఉంది.

రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది కనుకనే నిన్న అమలాపురంలో అల్లర్లలో 20 మంది పోలీసులకు గాయాలైనప్పటికీ వారు సంయమనంగా పాటించారు. మా మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్ళు తగులబెడుతున్నప్పటికీ మా పార్టీ కార్యకర్తలను సంయమనం పాటించాలని గట్టిగా చెప్పి కట్టడి చేశాము. లేకుంటే పరిస్థితి మరోలా ఉండేది.

ఇంతకీ కోనసీమ జిల్లాకు డా.అంబేడ్కర్ పేరు పెట్టాలా వద్దా? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు చెప్పాలి. ఒకవేళ పెట్టాలనుకొంటే వారి పార్టీ కార్యకర్తలకు ఇదే విషయం బహిరంగంగా చెప్పి నిన్న జరిగిన అల్లర్లను ఖండించాలి. ఒకవేళ జిల్లాకు అంబేద్కర్ పేరు వద్దనుకొంటే ఎందుకు వద్దనుకొంటున్నారో బహిరంగంగా చెప్పాలి,” అని డిమాండ్ చేశారు.

టిడిపి, జనసేన అధినేతలను సజ్జల చేసిన ఈ సవాళ్ళపై మాజీ మంత్రి టిడిపి సీనియర్ నేత అచ్చన్నాయుడు ధీటుగా స్పందించారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు కేసుపై నుంచి ప్రజల దృష్టి మళ్ళించడానికే ఆ పార్టీలో కొందరు ప్రముఖుల డైరెక్షన్‌లో అమలాపురంలో అల్లర్లు విధ్వంసం జరిగాయని భావిస్తున్నాను. లేకుంటే అమలాపురంలో సెక్షన్ 144 అమలులో ఉండగా ఆందోళనకారులు రోడ్లపైకి ఎలా రాగలిగారు? వారు మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్ళకు నిప్పు పెట్టేవరకు పోలీసులు వారిని ఎందుకు అడ్డుకోలేదు?వారి ఇళ్ళకు నిప్పు పెడితే వెంటనే ఫైర్ ఇంజన్లను రప్పించి ఎందుకు మంటలు ఆర్పకుండా ఆ దృశ్యాలు టీవీలలో పదేపదే వచ్చేలా ఎందుకు చేశారు?

టిడిపి ఏనాడూ ఇటువంటి విధ్వంస రాజకీయాలు చేయదు. కానీ వైసీపికి ఇటువంటి విధ్వంసాలు సృష్టించడం కొత్తకాదు. అంతా ఓ ప్లాన్ ప్రకారం జరిపించి ఆ నేరాన్ని ప్రతిపక్షాలపైకి నెట్టేయాలని ప్రయత్నిస్తోంది. వైసీపీ మంత్రుల మాటలలోనే ఇదంతా వారి కుట్రే అని అర్ధం అవుతోంది.

ADVERTISEMENT
Latest Stories