‘సాక్షి’ దినపత్రిక, వైఎస్సార్సీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలపై గుంటూరు జిల్లా నంబూరుకు చెందిన వైసీపీ నేత మందాల సంజీవరెడ్డి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. 2 కోట్లు ఇవ్వాలని తనను బ్లాక్ మెయిల్ చేస్తూ ‘సాక్షి’లో తనపై కథనాలు రాస్తున్నారని ఆరోపించారు. అమరావతిలోని సదావర్తి వారి సత్రం భూములను వేలంలో 25 కోట్లకు తాను దక్కించుకున్నానని, అప్పటి నుంచి తనను రెండు కోట్లు డిమాండ్ చేయడం మొదలుపెట్టారని ఆరోపించారు.
వారి డిమాండ్లకు తానూ తలొగ్గకపోవడంతో, తనకు, టీడీపీ నేతలకు సంబంధాలు ఉన్నట్లు ‘సాక్షి’ పత్రికలో కథనాలు రాస్తున్నారని, వారం పది రోజుల నుంచి ఫోన్ చేస్తూ, రెండు కోట్లు, మూడు కోట్లు కావాలని అడుగుతున్నారని వాపోయారు. సదావర్తి వారి సత్రం భూముల విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు గారికి గానీ, కుమారుడు లోకేష్ కు గానీ, అలాగే టీడీపీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ కు గానీ ఎటువంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు.
నలుగురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఈ మీడియా వాళ్లు ఇద్దరూ నన్ను టార్గెట్ బెదిరిస్తున్న వైనం తెలియాలనే మీడియా ముందుకు వచ్చానని సంజీవ రెడ్డి చేసిన ఆరోపణలు మరోసారి వైసీపీపై పొలిటికల్ వర్గాల్లో వినపడుతున్న అభిప్రాయాన్ని బలపరిచే విధంగా ఉన్నాయి.





