కాదేదీ భజనకు అనర్హం అన్నట్టు ఉంటుంది మన రాజకీయ నాయకుల వ్యవహారం. ఏదైనా ఒక పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులూ తమ అధ్యక్షుడిని ప్రసన్నం చేసుకోడానికి అష్టకష్టాలు పడుతూ ఉంటారు. సరిగ్గా ఇదే జరిగింది ఈరోజు ఉదయం సాక్షి దినపత్రికలో… ఎడిటోరియల్ పేజీలో ఆ పార్టీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణ రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రిని గాంధీ మహాత్ముడితో పోల్చేశారు.
ఏకంగా గాంధీ జయంతి నాడు గాంధీజీ మళ్ళీ పుట్టాడు అంటూ జగన్ చేస్తున్న అనేక కార్యక్రమాలను ఏకరువు పెట్టారు. జాతి కోసం ఒక పెద్ద ఉద్యమాన్ని నడిపి… తన ప్రాణాలు సైతం అర్పించిన నాయకుడితో ఒక రాజకీయ నాయుడిని పోల్చడం ఏంటి అంటూ గాంధేయ వాదులు సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు.
అటువంటి వ్యాసాన్ని పైగా గాంధీ జయంతి నాడు ప్రచురించిన సాక్షి జర్నలిస్టు విలువలపై విమర్శిస్తున్నారు. ఇకపోతే ఈ వ్యాసం రాసిన చల్లా గారు మొదటి నుండి వైఎస్సార్ కాంగ్రెస్ వీరవిధేయుడా అంటే అది కూడా కాదు. గతంలో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా చేసిన ఆయన ఐదు దశాబ్దాల పాటు టీడీపీలో ఉన్నారు.
గత ప్రభుత్వంలో రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ గా పదవి అనుభవించి ఎన్నికలకు కొంచెం ముందు వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్సీ అయిపోయారు. అసలు నాయకులకంటే అరువు నాయకులే ఎక్కువ హడావిడి చేస్తారు అని మరికొందరు ఎద్దేవా చెయ్యడం గమనార్హం.




