ఈ సారి రంజాన్ పండగ సల్మాన్ ఖాన్ అభిమానులకు చేదు అనుభవాలను మిగిల్చింది. 2011 నుండి వరుసగా రంజాన్ వేడుకకు సినిమాలను విడుదల చేస్తున్న సల్మాన్, తొలి వీకెండ్ గడిచేపాటికి రికార్డులు తిరగరాసే విధంగా కలెక్షన్స్ ను కొల్లగొట్టడం పారిపాటిగా మారింది. అయితే 2017 ఏడాది మాత్రం ఈ ‘కండల వీరుడు’ ఆశించిన ఫలితాన్ని అందిపుచ్చుకోలేక, భారీ డిజాస్టర్ ను మూటకట్టించుకున్నాడు. ప్రస్తుత బాక్సాఫీస్ ఫలితాన్ని చూస్తుంటే… మహా అయితే 100 కోట్ల క్లబ్ లోకి చేరుతుంది గానీ, 200 కోట్లు కూడా కష్టమేనని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
2011లో రంజాన్ సందర్భంగా విడుదలైన సల్మాన్ ‘బాడీగార్డ్’ సినిమా ఫస్ట్ వీకెండ్ నాటికి 88.75 కోట్లు అందుకోగా, ఆరేళ్ళ తర్వాత వరుస సక్సెస్ లు, సూపర్ స్టార్ డంతో వెలుగొందుతున్న సల్మాన్, “ట్యూబ్ లైట్” కేవలం 83.86 కోట్లు మాత్రమే అందుకుందంటే ఏ స్థాయిలో ఈ సినిమా నిరుత్సాహపరిచిందో అర్ధం చేసుకోవచ్చు. మరో విశేషం ఏమిటంటే… సెలవు రోజు అయిన రంజాన్ నాడు మునుపటి రోజుల కంటే తక్కువ కలెక్షన్స్ ను సాధించడం! తొలి రోజు 21.15 కోట్లు, శనివారం 21.17 కోట్లు, సండే 22.45 కోట్లు, మండే 19.09 కోట్లు అందుకుని, మొత్తమ్మీద తొలి నాలుగు రోజులకు 83.86 కోట్లు మాత్రమే అందుకుంది.
సరైన కధ, కధనాలు లేకపోతే సల్మాన్ ఖాన్ కైనా షేక్ ఇచ్చే రిజల్ట్ ను ఇస్తామని ఈ సందర్భంగా ప్రేక్షకులు మరోసారి రుజువు చేసారు. ఇప్పటికే షారుక్ కు వివిధ సందర్భాలలో ఇలాంటి అవాక్కయ్యే ఫలితాలను ఇచ్చిన ప్రేక్షకులు, ఈ సారి మరో సల్మాన్ ఖాన్ కు కూడా ఆ రుచి చూపించారు. ‘బాహుబలి 2’ సాధించిన రికార్డులతో ‘ట్యూబ్ లైట్’ కూడా ఆ దరిదాపులకు చేరుకుంటుందని బాలీవుడ్ వర్గాలు భావించగా, మిక్స్ డ్ టాక్ తో నడుస్తోన్న “దువ్వాడ జగన్నాధమ్” రేంజ్ కంటే కూడా తక్కువ స్థాయిలో ‘ట్యూబ్ లైట్’ ఫలితం ఉండడం గమనార్హనీయం.



