మహేష్ బాబులో మీకు బాగా ఇష్టమైన అంశం ఏంటి? ప్రిన్స్ సతీమణి నమ్రతతో మొదలుకొని, మహేష్ సన్నిహితులు త్రివిక్రమ్, పూరీ, శ్రీనువైట్ల వారంతా ఈ ప్రశ్నకు చెప్పిన ఏకైక సమాధానం… ‘సెన్స్ ఆఫ్ హ్యూమర్’ అని! తాజాగా ఈ జాబితాలోకి సమంత కూడా చేరింది. ‘బ్రహ్మోత్సవం’ విశేషాలు చెప్తూ ఇచ్చిన ఇంటర్వ్యూలో… మహేష్ ‘సెన్స్ ఆఫ్ హ్యూమర్’ సాధారణంగా ఉండదని… అది మామూలు వారి కంటే 100 రెట్లు ఎక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చింది.
అయితే… ఇక్కడ ఉన్న కండిషన్ ఏమిటంటే… మహేష్ కు సన్నిహితంగా మెలిగిన వారి దగ్గర మాత్రమే ప్రిన్స్ అలా ఉంటారంట. సెట్స్ లో ఎక్కడైనా నవ్వులు వినపడుతున్నాయంటే… అక్కడ మహేష్ ఉన్నట్టే లెక్క… అని చెప్పిన సమంత, ప్రిన్స్ వేసే పంచ్ లకు ‘బాబోయ్’ అనుకోవాల్సిందే అని చిలక పలుకులు పలికింది. అలాంటి పంచ్ లు నా మీద కూడా పడ్డాయని, అయితే షూటింగ్ కు వెళ్ళే ముందు ‘ఈ రోజు మహేష్ పంచ్ లు నా మీద పడకుండా ఉండాలని దేవుడిని మొక్కుకోవాలని’ చెప్పిన సంగతులు ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.
‘దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాల కంటే ఎక్కువ రోజులు మహేష్ తో పని చేసానని, అందుకే ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో ఎక్కువ సంగతులు తెలిసాయని అన్న సమంత, ఈ సినిమాలో తనది కేవలం ఒక పాత్ర మాత్రమేనని, అది కూడా తన మనోభావాలకు అతి దగ్గరగా ఉండే పాత్ర అని, ‘బ్రహ్మోత్సవం’ సినిమా ఒక ఉత్సవంలా ఉంటుందని చిత్ర విశేషాలను చెప్పింది.



