ఏదైనా షాప్ ఓపెనింగ్ వంటి కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంలో హీరోయిన్లకు ఎదురయ్యే అనుభూతులు తెలియనివి కావు. ముద్దుగుమ్మలను అతి దగ్గర నుండి చూడాలని, వీలుంటే వారిని ఓ సారి ఎలాగైనా టచ్ చేయాలని ఊవ్విళ్ళూరే అభిమాన గణానికి కొదవలేదు. గతంలో ఎన్నో సందర్భాలలో ఎందరో హీరోయిన్లు చవిచూసిన ఈ అనుభవం, తాజాగా ‘కుందనపు బొమ్మ’ సమంతకు కూడా ఎదురయ్యింది.
‘వీకేర్’ చెప్పుల సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నటువంటి సమంత, వారి నూతన శాఖను చెన్నైలోని, మధురైలో ప్రారంభించేందుకు వెళ్ళింది. స్థానిక అభిమానుల అత్యుత్సాహంతో సమంతకు పట్టపగలే చుక్కలు కనిపించాయి. ఈ ప్రారంభోత్సవానికి సమంత వస్తుందని భారీగా ప్రచారం చేయడంతో, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు సమంతను రౌండప్ చేసారు.
తీవ్ర ఇబ్బందుల మధ్యలో ఎలాగోలా షోరూమ్ లోకి తీసుకెళ్ళగలిగిన సిబ్బంది, తిరిగి షోరూమ్ నుండి కారులోకి మాత్రం ఎక్కించలేకపోయారు. సమంత ఎలాగైనా చూడాలన్న ఆకాంక్షతో, ఈ ముద్దుగుమ్మ కారు టైర్లకు ఏకంగా పంచర్లు చేసారు. అంతేకాదు, స్పీకర్లు వంటి వాటిని కూడా ధ్వంసం చేయడంతో షోరూమ్ యాజమాన్యం, కార్యక్రమ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆపై అభిమానులపై పోలీసులు లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టారు. ఈ పరిణామాలతో కాసేపు ఆందోళన చెందిన సమంత, ఎట్టకేలకు చెన్నై బయలుదేరి వెళ్లింది.



