ముద్దు ముద్దు మాటలతో అల్లరి పనులు చేస్తూ… సిల్వర్ స్క్రీన్ పై క్యూట్ గా కనిపించే సమంత, టాలీవుడ్ టాప్ చైర్ ను దాటిపోయింది. కమర్షియల్ కోణంలో ఉన్న గ్లామర్ పాత్రలతో పాటు, అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రలలోనూ కనిపించిన సమంత, ఇక తాను చేసే పాత్రలేవీ రావడం లేదంటూ ఇటీవల నిట్టూర్పును ప్రదర్శించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రకటన తర్వాత టాలీవుడ్ దర్శకులలో సమంత పట్ల కాస్త ఆలోచన మారిందో ఏమో గానీ, అరుదైన చిత్రాలు ఈ ‘కుందనపు బొమ్మ’ ఖాతాలో వచ్చి పడుతున్నాయి.
‘రాజు గారి గది 2’లో ఓ దెయ్యం పాత్రలో సమంత దర్శనమివ్వనుందన్న సమాచారం ఇప్పటికే ఆమె అభిమానుల్లో క్యూరియాసిటీని పెంచుతుండగా, మరో వైపు ‘సావిత్రి’ బయోపిక్ లో ఓ కీలక పాత్రలో సమంత మెరవనుంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో కర్ర తిప్పుతూ పోస్ట్ చేసిన వీడియో వీక్షకులను అవాక్కు చేస్తోంది. దాదాపుగా ఒక నిముషం పాటు అద్భుతంగా కర్ర తిప్పిన ఈ వీడియోకు నెటిజన్లు నీరాజనం పలుకుతున్నారు. ఏ సినిమా కోసం సమంత ఈ విద్య నేర్చుకుందో గానీ, హీరోలను మించిపోయే రేంజ్ లో సమంత కనపడుతోంది.



