ఒకే తరహా నటనను కనబరిస్తే… పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాలనైనా నిర్మొహమాటంగా తిరస్కరిస్తున్న రోజులివి. మరి ‘హృదయ కాలేయం’ నుండి ఇప్పటివరకు ఒకే తరహా విధానంతో నటిస్తోన్న సంపూను ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారు? అంటే జవాబు అంచనాలకు అందనిది అయితే కాదు. తాజాగా విడుదల చేసిన “వైరస్” ట్రైలర్ ఏ మాత్రం రుచించకపోగా, కష్టపడి ఒక సెలబ్రిటీ స్థాయికి వచ్చిన సంపూ, దానిని నిలబెట్టుకోవడంలో విఫలం అవుతున్నారనే భావనను మిగిల్చింది.
ఒక వైరస్ తో ప్రముఖ వ్యక్తి ఎలా మరణించాడు? దానిని చేధించే క్రమంలో హీరో ఎలాంటి విన్యాసాలు చేసాడు? అనేదే క్లుప్తంగా “వైరస్” సినిమా కధగా కనపడుతోంది. సంపూర్ణేష్ బాబు తప్ప ఈ సినిమాలో నటీనటులెవరూ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు, అలాగని ప్రేక్షకులకు తెలిసిన సంపూ కూడా ఆకట్టుకోవడంలో విఫలమయ్యాడు. ఒక రకంగా చెప్పాలంటే బి, సి గ్రేడ్ మూవీ మాదిరి కనపడుతోంది. చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ కూడా అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్న నేపధ్యంలో… ఈ సినిమా ఫోటోగ్రఫీ, టేకింగ్ దయనీయంగా ఉన్నాయి.
బహుశా సంపూకు పెట్టిన బడ్జెట్ కు ఇంతే అనుకున్నారో లేదంటే ఎప్పుడో రెడీ అయిన సినిమాను ఇప్పడు తీసుకువస్తున్నారో గానీ, ఈ ట్రైలర్ క్లైమాక్స్ లో వచ్చే ‘మృత్యువుతో పరిచయాలు ఎందుకు బే’ డైలాగ్ మాదిరి, ఈ సినిమాతో పరిచయం పెట్టుకోనవసరం లేదేమో… అన్న సంకేతాలను ఇస్తోంది. ఓ సామాన్య వ్యక్తిగా, నిరుపేద కుటుంబం నుండి వచ్చిన సంపూపై గౌరవభావం చూపించవచ్చు గానీ, మరి ఈ స్థాయి సినిమాలను ఒప్పుకుంటే మాత్రం, ఆ గౌరవం ఇంకెన్నాల్లో ఉండదని గమనించాలి. చూడబోతుంటే… ప్రేక్షకుల పాలిట ఇది మరీ డేంజరస్ ‘వైరస్’లా కనపడుతోంది.


