రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో అన్నా చెల్లేళ్ల రాజకీయ పోరులు రసవత్తరంగా సాగుతున్నాయి. ఏపీలో వైసీపీ అధినేత వైస్ జగన్ కు ఆయన సోదరి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైస్ షర్మిల కు మధ్య 2023 లో రాచుకున్న రాజకీయ చిచ్చు ఈనాటికి మంటలు రాజేస్తూనే ఉంది.
ఇక తెలంగాణ విషయానికొస్తే, బిఆర్ఎస్ అధినేత కేటీఆర్ ఆయన సహోదరి కవిత మధ్య 2025 లో రాచుకున్న రాజకీయ చిచ్చు నివురుకప్పిన నిప్పు మాదిరి నిప్పులు కక్కుతోంది. అలాగే ఏ నిమిషంలో అయినా విస్ఫోటనంగా మారేందుకు సిద్ధంగా ఉంది.
అయితే ఈ రెండు పార్టీల మధ్య ఉన్న భావసారూప్యత పుణ్యమో లేదా ఇద్దరి అన్నలకు ఉన్న చెల్లెళ్ళ శాప ఫలితమో కానీ ఈ రెండు పార్టీలు కూడా తమ సొంత తోబుట్టువుల పై ఒకేరకమైన రాజకీయం చేస్తూ రాష్ట్ర ప్రజలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి.
నాడు 2024 ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ అధినేత వైస్ జగన్ తన తోబుట్టువు షర్మిల కట్టుకున్న చీర రంగు మీద బహిరంగంగా విమర్శలు గుప్పించారు. షర్మిల పసుపు రంగు చీర కట్టుకుంది కాబట్టి షర్మిల కు టీడీపీ తో సంబంధాలు ఉన్నాయంటూ, ఆమె కూడా బాబు మనిషే అనడానికి ఇంతకన్నా పెద్ద రుజువులు కావాలా అంటూ షర్మిల పై పసుపు మరక వేశారు.
సరిగ్గా ఇప్పుడు బిఆర్ఎస్ కూడా ఇదే మాదిరి కవిత కట్టుకున్న చీర రంగు మీద రాజకీయం మొదలుపెట్టింది. తాజాగా కాంగ్రెస్ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడి నిచ్చితార్ధ వేడుకకు హాజరైన కవిత కాంగ్రెస్ జెండా రంగులున్న చీరను ధరించారు.
దీనితో ఇక రంగంలోకి దిగిన బిఆర్ఎస్ సోషల్ మీడియా కవిత త్వరలో కాంగ్రెస్ లో చేరబోతున్నారు,అందుకు ఇదే నిదర్శనం, అందులో భాగంగానే కవిత తన చీరతో తెలంగాణ ప్రజలకు ఒక హింట్ ఇచ్చారు అంటూ బిఆర్ఎస్ శ్రేణులు కవిత టార్గేట్డ్ గా సోషల్ మీడియాలో రాజకీయం మొదలుపెట్టారు.
అయితే రాజకీయంలో ఉన్న మహిళలు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ జెండా రంగు చీరలే ధరించాలా.? అలాకాకుండా ప్రత్యర్థి పార్టీ జెండా రంగు చీరలు ధరిస్తే అదేదో రాజకీయ అక్రమ సంబంధానికి నిదర్శనముగా భావించాలా.? రాజకీయాలలో ఉండే పురుషులు సహజంగా వైట్ అండ్ వైట్ ధరిస్తారు, వారు అవి కాకుండా వేరే రంగు దుస్తులు ధరిస్తే అదేమైనా మహాపాపమవుతుందా.?
లేదా రాజకీయాలలో ఉండే మహిళలకు కేవలం ఆ పార్టీ జెండా రంగు చీరలే ధరించాలి అని రాజ్యంగంలో ఎక్కడైనా లికించబడిందా.? కట్టుకునే చీర రంగు ఆధారంగా ఒక మహిళకు రాజకీయ రంకులు అంటగట్టడం వైసీపీ కి బిఆర్ఎస్ కి ఎంతమాత్రం సబబు.? సొంత చెల్లెళ్ళ పైనే ఈ తరహా రాజకీయాలను ప్రోత్సహించే పార్టీ అధినేతలు ఇక సామాన్య మహిళకు ఎటువంటి గౌరవం ఇవ్వగలరు.?




