ఎందరి చేతులో మారిన శేఖర్ కమ్ముల “ఫిదా” సినిమా చివరికి సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతుల్లో పడిన విషయం తెలిసిందే. ‘హ్యాపీ డేస్’ను పంపిణీ చేసిన దిల్ రాజు గారి నిర్మాణంలో పని చేయడం నిజంగా చాలా సౌకర్యవంతంగా ఉందని, నిజానికి తెలుగు సినిమాకు ఇలాంటి నిర్మాతలు కావాలని, ఒక రకంగా అందుకే ఆయన అంత సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అయ్యారని దిల్ రాజు గురించి దర్శకుడు శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చారు.
దర్శకుడిగా నా పని అయిపోయింది… ఇక ఇప్పట్నుంచి ఆయన విశ్వరూపం చూస్తారు… ప్రమోషన్స్ ఎలా చేయాలో బాగా తెలిసిన వ్యక్తి… అంటూ కితాబిచ్చారు. 21వ తేదీన సినిమా విడుదల కాబోతోంది కాబట్టి, ఈ లోపున ఏం చేయాలో మొత్తం దిల్ రాజు గారు చూసుకుంటున్నారని, మా సినిమా యూనిట్ కు చెందినంత వరకు ‘ఫిదా అనేది మా బాహుబలి’ సినిమా లాంటిదని అభివర్ణించారు.
నిజమే… సినిమాకు తగిన విధంగా పబ్లిసిటీ ఎలా చేయాలో దిల్ రాజుకు బాగా తెలుసనే చెప్పాలి. లెక్కలు – బొక్కలు తెలిసిన నిర్మాతగా ట్రేడ్ వర్గాలలో దిల్ రాజుకున్న పేరు తెలియనిది కాదు. అయితే ఇటీవల విడుదలైన “ఫిదా” ధియేటిరికల్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి నెగటివ్ స్పందన రావడంతో, ఇక్కడ నుండి ప్రేక్షకులకు ఎలా చేరువ చేస్తారు అన్నది కాస్త ఆసక్తికరంగానే ఉంది. అయితే ఆడియో పరంగా మాత్రం ‘అదుర్స్’ అనిపించేలా పాటలు ఉండడం ప్లస్.



