Actor Naresh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు అధికార వైసీపీ కి ఇటు కూటమి పార్టీలకు మధ్య హోరాహోరీ ఎన్నికల ప్రచారం సాగుతున్న తరుణంలో నిన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి.

తనను కలవడానికి వస్తున్న అభిమానుల సముహంలో కొంతమంది అల్లరిమూకలు చేరి చిన్న చిన్న బ్లేడ్లతో నా పైన, నా సెక్యూరిటీ వారి పైన దాడికి దిగుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో అందరు అప్రమతంగా నడుచుకోవాలి అంటూ పార్టీ క్యాడర్ ను అప్రమత్తం చేయడంతో పాటు రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను ప్రజలకు వివరించారు పవన్.

ప్రతిపక్ష నాయకుల మీద దాడులు జరిగే అవకాశం ఉందనే అప్రమత్తతతో టీడీపీ నేత నారా లోకేష్ కు కేంద్ర ప్రభుత్వం Z కేటగిరి భద్రతా కల్పించారు. రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా దాడులకు పాల్పడడం రాజకీయ వ్యవస్థను కించపర్చడమే అవుతుంది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాబోతుంది అన్న గాలి వీచిన నాటి నుంచి ఏపీలో ఈదాడుల సంస్కృతీ పెరుగుతూ వస్తుంది.

గత ఎన్నికల సమయాన్ని ఒక్కసారి ప్రామాణికంగా తీసుకుంటే ఈసారి రాష్ట్రంలో వైసీపీ ఒక్క ఛాన్స్ కు అవకాశం రానుంది అనే ఆలోచన మొదలవగానే విశాఖలో అప్పటి ప్రతిపక్ష నేత జగన్ పై కోడికత్తి దాడి జరిగింది. దీనితో వైసీపీ ఒక్క ఛాన్స్ అవకాశానికి కాస్త బలం చేకూరింది. ఆ తరువాత జరిగిన వైస్ వివేకా హత్య జగన్ ముఖ్యమంత్రి పదవి కాంక్షకు ఒక అస్త్రం లా మారిపోయింది.

ఇలా వైసీపీ అధికారంలోకి రావడానికి ఈ రెండు దాడుల ప్రభావం కొంత మేర సహాయపడిందనే చెప్పాలి. ఇక ఒక్కసారి వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష పార్టీ నేతల మీద, ఆ పార్టీ క్యాడర్ మీద, ఏకంగా టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయాల మీద కూడా దాడులు కొనసాగుతూనే వచ్చాయి. ఈ దాడులు రాజకీయ పార్టీల నేతలలో ఆగిపోలేదు. తమ పార్టీ కి పార్టీ నేతలకు వ్యతిరేకంగా గొంతెత్తిన అనేకమంది సాధారణ పేద, దళిత వ్యక్తులు కూడా ఈ అధికార అహంకార దాడులకు బలయ్యారు.

అందులో డాక్టర్. సుధాకర్, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం, బాపట్ల జిల్లాలో 10 వ తరగతి చదువుతున్న అమర్నాధ్….ఇలా ఎన్నో ఉదాహరణలు కళ్ళముందు సాక్ష్యాలుగా కాలిపోయాయి. అలాగే వైసీపీ సర్కార్ హయాంలో రాష్ట్రంలో జరిగిన స్థానిక ఎన్నికల అంశానికి వస్తే అధికార పార్టీ నేతల బెదిరింపులకు బయపడి కొన్ని ప్రాంతాలలో ప్రతిపక్ష పార్టీల నేతలు నామినేషన్ కూడా వేసే సాహసం చేయలేకపోయారు.

సాహసించిన వారిలో కొంతమంది వైసీపీ నేతల దాడులకు బలికావాల్సి వచ్చింది. కేవలం స్థానిక సంస్థల ఎన్నికలలోనే రాష్ట్రంలో ఎన్నడూ చూడని దాడుల సంసృతిని చూసిన రాజకీయ పార్టీల నేతలు, ప్రజలు ఈసారి జరగబోయే సాధారణ ఎన్నికలలో రాష్ట్రంలో వాతావరణం ఏస్థాయికి చేరుతుందో అనే ఆందోళనలో ఉన్నారు. ఇటువంటి కీలక సమయంలో పవన్ చేసిన వ్యాఖ్యలు అటు రాజకీయ పార్టీలతో పాటు ఇటు ఓటర్లను భయాందోళనకు గురి చేస్తున్నాయి.

ఈ భయానక వాతావరణాన్ని ఎలా ఎదుర్కోవాలో అన్న ఆలోచనలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇపుడు విజయనిర్మల కుమారుడు, సినీ నటుడు, బీజేపీ పార్టీ సభ్యుడు అయినా నరేష్ చేసిన పోస్ట్ మరింత భయపెడుతుంది. గతంలో వైసీపీ కి సానుభూతి పరుడిగా ఉన్న నరేష్ ఇప్పుడు అదే అధికార పార్టీకి పరోక్షంగా వ్యతిరేక పోస్ట్ పెట్టారు. కాషాయ కండువా మహిమో లేక ఏపీలో అధికార పార్టీ అవలంబిస్తున్న విధానాలు నచ్చకో, ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులను అంచనా వేసారో కానీ…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార మార్పిడికి ముందు పెద్ద రక్త పాఠం జరిగే అవకాశం ఎక్కువగా ఉందని నా నమ్మకం అంటూ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసారు నరేష్. అధికార మార్పిడికి ముందు అంటే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మారబోతుందా..? అసలు రాష్ట్రంలో ఈ రక్తపాతం సృష్టించేదెవరు..? దానికి బలయ్యేదెవరు..? ఈ పోస్ట్ వెనుక దాగి ఉన్న ఆంతర్యం ఏమిటి అంటూ నరేష్ చేసిన పోస్టు పై పలు ప్రశ్నలు వెంటాడుతున్నాయి.

ఇప్పటికే పవన్ బ్లెడ్ బ్యాచ్ అంటూ, మన ప్రత్యర్థి వర్గం రాజకీయ చరిత్ర తెలుసుగా అంటూ హింట్ ఇచ్చిన నేపథ్యంలో తమ అభిమాన నాయకుడికి ఎం జరుగుతుంది అనే భయాందోళనలో ఉన్నారు జనసైనికులు. దానికి తోడు ఇపుడు నరేష్ కూడా ఏపీలో రక్తపాతం అంటూ పోస్ట్ చేయడంతో ఈసారి ఎన్నికలు సజావుగా సాగాలి అంటూ వేడుకుంటున్నారు ఏపీ ప్రజానీకం.