నేడే సింహాచలం గిరి ప్రదక్షిణ.. భక్తి, ముక్తి, ఆరోగ్యం, ఆహ్లాదం!

Simhachalam Giri Pradakshina devotees

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్దమైన పుణ్యక్షేత్రాలలో విశాఖపట్నంలోని సింహాచలం కూడా ఒకటి. శ్రీ మహావిష్ణువు వరాహావతారం, నరసింహావతారం దాల్చిన సంగతి తెలిసిందే. కనుక దేశంలో పలు రాష్ట్రాలలో నరసింహస్వామి వారి ఆలయాలున్నాయి.

కానీ ఒక్క సింహాచలంలో మాత్రమే ఈ రెండు అవతారాలతో పాటు మానవరూపం కూడా కలిసిన ‘వరాహలక్ష్మీ నరసింహస్వామివారి’ రూపంలో కొలువయ్యారు.

ADVERTISEMENT

స్వామివారి ఉగ్రరూపాన్ని శాంతింపజేసేందుకు గాను ఏడాది పొడవునా గంధం పూత పూస్తుంటారు. మళ్ళీ అక్షయ తృతీయనాడు ఆ చందనం పూత అంతా తొలగించి, నిజరూప దర్శనం కల్పిస్తారు. కనుక ఏడాది అతికొద్ది రోజులు మాత్రమే భక్తులకు స్వామివారి నిజరూపదర్శన భాగ్యం లభిస్తుంది. మిగిలిన కాలం అంతా లింగాకారంలోనే దర్శనమిస్తారు.

ఇక మరో విశేషమేమిటంటే, మరే నరసింహక్షేత్రంలో లేని ‘కప్ప స్థంభం’ ఈ దేవాలయంలో మాత్రమే ఉంది. ఈ స్థంభం అడుగుభాగంలో శక్తివంతమైన ‘సంతాన గోపాల స్వామి యంత్రం’ ప్రతిష్ఠించబడి ఉంది. కనుక సంతానం కలుగని దంపతులు బేడ మండపంలో గల ఈ స్థంభాన్ని కౌగలించుకుని స్వామివారిని ప్రార్ధిస్తుంటారు. అలాగే కోరిన కోర్కెలు నెరవేరేందుకు కూడా భక్తులు, పలువురు సినీ పరిశ్రమ, రాజకీయ ప్రముఖులు కూడా ఈ కప్ప స్థంభాన్ని కౌగలించుకొని వెళ్తుంటారు.

ఇందుకుగాను భక్తులు స్వామివారికి నగదు, ఆభరణాల రూపంలో కానుకలు సమర్పించుకుంటారు. వాటినే కప్పం (పన్ను) అంటారు కనుక ఈ స్థంభానికి కప్పు స్థంభంగా ప్రసిద్ధి చెందింది.

ఇక సింహాచలం మరో ప్రత్యేకత ఏమిటంటే, ఏటా ఆషాఢ పౌర్ణమి రోజున సింహాచలం గిరిప్రదక్షిణ కార్యక్రమం జరుగుతుంది. సింహాచలం కొండ దిగువన తొలి పావంచా వద్ద భక్తులు కొబ్బరికాయలు కొట్టి చెప్పులు లేకుండా కొండ చుట్టూ సుమారు 32 కిమీ కాలినడక గిరి ప్రదక్షిణ చేస్తారు.

నేడు జరుగుతున్న ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనేందుకు ఇరుగు పొరుగు జిల్లాలు, రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చి పాల్గొంటున్నారు. వారిలో చిన్న పిల్లలు మొదలు వృద్ధులు వరకు అన్ని వయసుల వాళ్ళు ఉంటారు.

దీనిలో భాగంగా వారు విశాఖలో ప్రముఖ పర్యాటక కేంద్రం కైలాసగిరి (కొండ) దాని పక్కగా సాగుతూ, ఎదురుగా ఉన్న సముద్రంలో స్నానాలు చేస్తారు. అక్కడ కాసేపు సేద తీరిన తర్వాత మళ్ళీ నడక మొదలు పెడతారు.

ఈ ఒకే ఒక్క ప్రదక్షిణతో సకల పాపలు హరించుకుపోతాయని భక్తులు నమ్ముతారు. భక్తి, ముక్తితో పాటు ఏకధాటిగా 32కిమీలు నడిచి గిరిప్రదక్షిణ పూర్తి చేసేసరికి సహజంగానే కొంత బరువు కోల్పోతారు (తగ్గుతారు) కూడా.

పచ్చటి చెట్లతో నిండిన కొండలు, వాటిని ఆనుకొని సముద్రతీరం, దానిలో ఉన్న అనేక బీచ్ పార్కులు, కైలాసగిరి, విశాఖలో పలు పర్యాటక ఆకర్షణలు చూసుకుంటూ ముందుకు సాగే ఈ గిరి ప్రదక్షిణ ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది. సింహాచలం గిరి ప్రదక్షిణ అంటే భక్తి, ముక్తి, ఆరోగ్యం, ఆహ్లాదం అన్నమాట!

ADVERTISEMENT
Latest Stories