ప్రిన్స్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో ఒకేసారి సినిమాలు నిర్మిస్తూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా వినపడిన పేరు సింగమనల రమేశ్. అయితే ఆ తర్వాత కాలంలో ట్రావన్ కోర్ బోర్డు మెంబర్ గా ఉన్న రమేశ్ పైన అనేక ఆరోపణలు వ్యక్తం కావడం, అలాగే అనంతపురం ఫ్యాక్షన్ రాజకీయాలతో సంబంధాలు ఉన్నాయని మీడియా వర్గాల్లో సమాచారం హల్చల్ చేయడంతో సినిమా నిర్మాణాలకు దూరంగా ఉన్నారు.
అయితే ఇదే సమయంలో రమేశ్ నిర్మించిన రెండు సినిమాలు దారుణ పరాజయాలు పాలవ్వడంతో కొంత ఆర్ధికంగా వెనక్కి వెళ్ళారని, ఈ క్రమంలో అతను ఇచ్చిన కొన్ని చెక్కులను చెల్లించలేకపోయాడని కోర్టులో కేసులు నమోదయ్యాయి. అలాంటి ఓ కేసులో తాజాగా న్యాయస్థానం దోషిగా నిర్ధారిస్తూ తీర్పు వెలువడింది. కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం జిల్లెల గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి నుంచి శింగనమల రమేష్ 15 లక్షల రూపాయలు అప్పు తీసుకుని, తిరిగి చెక్కు ఇచ్చి దానిని బౌన్స్ చేసారు. దీంతో బాధితుడు కర్నూలు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, కేసును విచారించిన న్యాయస్థానం సింగమనల రమేశ్ కు ఏడాది కాలం పాటు జైలు శిక్షను ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది.



