రెండు తెలుగు రాష్ట్రాలలో అధికార – విపక్షాల మధ్య జరుగుతున్న రాజకీయాలు, వాటి విమర్శలు గమనిస్తే ఏపీలో అధికార కూటమి కాస్త ఆచితూచి వ్యవహరిస్తుంటే విపక్ష వైసీపీ మాత్రం కనీస ఆలోచన లేకుండా విమర్శలు చేస్తుంది. ఇక తెలంగాణ విషయానికొస్తే ప్రతిపక్ష బిఆర్ఎస్ రెచ్చకొట్టే రాజకీయం చేస్తుంటే అధికార కాంగ్రెస్ రెచ్చిపోతూ విమర్శలు చేస్తుంది.
తాజాగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొదలుకుని మాజీ మంత్రి హరీష్ రావు వరకు సీఎం రేవంత్ టార్గెట్ గా విమర్శలు సంధించింది. రేవంత్ ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు అని, ఆయన దమ్ముంటే సీఎం పదవికి రాజీనామా చేసి ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు రావాలంటూ హరీష్ రేవంత్ కు సవాల్ విసిరారు.
ఇక కేటీఆర్ సైతం రేవంత్ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ సమాజం వెయ్యి కళ్ళతో ఎదురు చేస్తుందని, రేవంత్ సర్కార్ రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా మోసం చేస్తుందని రేవంత్ ను టార్గెట్ చేసారు.
అయితే తన పై బిఆర్ఎస్ ముఖ్యనేతలు చేస్తున్న ఈ విమర్శలకు గాను సీఎం రేవంత్ నేడు గట్టిగా బదులు చెప్పారు. నేడు శిల్ప కళా వేదికలో రైతులతో ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించిన సీఎం రేవంత్ గత బిఆర్ఎస్ ప్రభుత్వం మీద ఆ పార్టీ పెద్దల మీద విరుచుకుపడ్డారు.
కేసీఆర్ ని ఒక పశుపతిగా పోలుస్తూ రెచ్చిపోయారు. కేసీఆర్ మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ అని, మిగులు బడ్జెట్ తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పంగా మార్చారని, కాళేశ్వరం తో వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని, పశుపతి ని ఫామ్ హౌస్ లో బంధిస్తే ఇప్పుడు పిల్ల రాక్షసులు రాష్ట్రంలో తిరుగుతున్నారంటూ మండిపడ్డారు.
అలాగే నన్ను సీఎం పదవికి రాజీనామా చెయ్యాలంటూ డిమాండ్ చేస్తున్న మీరు అధికార పీఠం మీ అయ్యా జాగీరనుకుంటున్నారా.? లేదా ఇదేమన్నా మీ తాత గడీ అనుకుంటున్నారా బిడ్డా.? అంటూ బిఆర్ఎస్ నేతల విమర్శలకు రీసౌండ్ లో ప్రతి విమర్శలు చేసారు.
మొదటి నుంచి కూడా రేవంత్ దూకుడుగానే రాజకీయం చేస్తారు, అందునా బిఆర్ఎస్ నేతల విమర్శలకు ఏ మాత్రం వెనకడుగేసేదే లేదు అన్నట్టుగా ప్రతి విమర్శ కూడా అంతే గట్టిగా ఇస్తారు. నాడు బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా రేవంత్ ఎక్కడ తగ్గేదెలా అన్నట్టుగానే నాటి సీఎం కేసీఆర్ మీద మంత్రి కేటీఆర్ మీద అదే విధమైన రాజకీయంతో ముందుకెళ్లారు.
రేవంత్ రెడ్డి కి తెలంగాణ ప్రజలు దగ్గరవడానికి కూడా ఒకరకంగా ఆయన దూకుడైన రాజకీయమే కారణం. బిఆర్ఎస్ నేతలు రేవంత్ ను ఎంత రెచ్చకొడితే అది బిఆర్ఎస్ నేతలకే నష్టం అనేది నేటి రేవంత్ ప్రసంగంతో బిఆర్ఎస్ శ్రేణులకు ఒక క్లారిటీ వచ్చింది. ఏపీ సీఎం మాదిరి రేవంత్ సున్నితమైన ప్రతివిమర్శ చెయ్యలేరు.
ముళ్ళు ను ముల్లుతోనే తియ్యాలి అనే సిద్ధాంతంతో రేవంత్ దూకుడుతోనే ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కుంటారు. మరి ఈసారి కూడా రేవంత్ దూకుడు బిఆర్ఎస్ ను రాజకీయం గా కట్టడి చేస్తుందా.? తెలంగాణ సమాజాన్ని మరోసారి కాంగ్రెస్ వైపు ఆకర్షిస్తుందా.? అన్నది చూడాలి.




