వైసీపీ నేతలు… వారి ప్రభుత్వ నైపుణ్యాలు చాలా వేరు. వారు శాసనసభలో, బయట, ప్రెస్‌మీట్‌లలో, సొంత మీడియాలో, సోషల్ మీడియాలో తమ నైపుణ్యాలను ప్రదర్శించేవారు. ఐదేళ్ళపాటు ‘వైసీపీ స్కిల్స్’ చూసిన రాష్ట్ర ప్రజలు అనేక కొత్త విషయాలు తెలుసుకున్నారు.
వారి నైపుణ్యాలు వేరని ముందే చెప్పుకున్నాము కనుక చంద్రబాబు నాయుడు ‘స్కిల్ డెవలప్‌మెంట్’ అంటే వారు అపార్ధం చేసుకొని ఆయన్ని జైల్లో పెట్టారు. అంతటితో సరిపెట్టుకుంటే బాగానే ఉండేది. కానీ ప్రజలు సైతం ‘స్కిల్ డెవలప్‌మెంట్’ అంటే ఏదో బూతు పదమని భావించేలా చేశారంటే అతిశయోక్తి కాదు.
కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు సిఎం అయిన తర్వాత ‘స్కిల్ డెవలప్‌మెంట్’ అంటే బూతు పదం కాదు… ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవడం కోసం అవసరమైన నైపుణ్యాల శిక్షణ, నైపుణ్యాభివృద్ధి మాత్రమే అని ప్రజలకు నమ్మకం కలిగేలా చేశారు.
మంత్రి నారా లోకేష్ గురువారం ఉండవల్లిలో ఇదే అంశంపై అధికారులతో సుదీర్గంగా చర్చించారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఐటి కంపెనీలు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు వస్తున్నాయి. ముఖ్యంగా ఐటి రంగంలో ఏఐతో పెను మార్పులు వస్తున్నాయి. కనుక ఆయా రంగాలలో యువతకు తగిన శిక్షణ ఇచ్చి, నైపుణ్యాభివృద్ధి చేసుకునేందుకు ఇప్పటి నుంచే గట్టి ప్రయత్నాలు చేయాలని అధికారులకు సూచించారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కోసం ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ స్థాయిలోనే తగిన కోర్సులు రూపొందించి ప్రవేశపెట్టాలని సూచించారు. దీని కోసం విద్యావేత్తలు, ఆయా రంగాలలో నిపుణుల సలహాలు, సూచనలు స్వీకరించి భవిష్యత్ అవసరాలకు తగిన విధంగా కోర్సులు రూపొందించాలని సూచించారు. స్కిల్ డెవలప్‌మెంట్ పోర్టల్ రూపొందించి యువతకు అందుబాటులోకి తేవాలని మంత్రి నారా లోకేష్ అధికారులకు సూచించారు.
సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, మంత్రులు కృషితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి కంపెనీలు తరలి వస్తున్నాయి.
కానీ నైపుణ్యాభివృద్ధిలో మన ఏపీ యువత వెనుకబడితే ఈ అవకాశాలను ఇతర రాష్ట్రాలవారు అందిపుచ్చుకొని లబ్ది పొందుతారు. హైదరాబాద్, బెంగళూరు, అమెరికాలో ఇదే జరుగుతోంది కదా?
రాన్రాను నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోంది. అనేక కొత్త కొత్త అవకాశాలు కల్పిస్తున్న ఏఐ పుణ్యమాని అనేక కంపెనీలు నిత్యం వేలాది మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూనే ఉన్నాయి. కనుక ఉద్యోగాల కోసం పోటీ పడేవారి సంఖ్య చాలా వేగంగా పెరిపోతోంది.
దీనికి ఏకైక పరిష్కారం ‘స్కిల్ డెవలప్‌మెంట్’ మాత్రమే. అయితే ‘స్కిల్ డెవలప్‌మెంట్’ అంటే బూతు పదం కాదు. అర్థం కాని బ్రహ్మ పదార్ధం అంతకంటే కాదు.
కనుక ప్రభుత్వం తోడ్పాటు ఉన్నా లేకున్నా యువత ఎప్పటికప్పుడు అప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుండటం చాలా చాలా అవసరమే.
చివరిగా ఒక మాట! 75 ఏళ్ళ వయసులో సిఎం చంద్రబాబు నాయుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ, ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతున్నప్పుడు యువత నేర్చుకోలేరా?




