ఈ సంక్రాంతికి విడుదలైన నాలుగు సినిమాలలో చివరి చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అక్కినేని నాగార్జున నటించిన “సోగ్గాడే చిన్నినాయనా” అనూహ్య విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలకే అసాధ్యంగా కనపడిన 50 కోట్ల క్లబ్ లో అక్కినేని నాగార్జున అవలీలగా చేరుకోవడం విశేషం. పూర్తి ఎంటర్టైన్మెంట్ పంథాలో సాగిన ఈ సినిమాకు సంబంధించిన 50 కోట్ల క్లబ్ ట్రైలర్స్ ప్రస్తుతం బుల్లితెరపై ప్రదర్శితమవుతున్నాయి.
అక్కినేని అభిమానులను మరింత ఉత్సాహపరిచే విధంగా ఉన్న ఈ ట్రైలర్ లో నాగ్ సినిమాలో డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో చెప్పిన ‘వాసి వాడి తస్సాదియ్యా…’ అనే డైలాగ్ తో అదరగొడుతున్నారు. తన సమకాలీన హీరోలైన చిరు, బాలయ్య, వెంకీలకు సాధ్యం కాని ఈ రికార్డును నాగ్ సొంతం చేసుకోవడంతో ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీలో ఉన్నారు. నిజానికి 50 కోట్ల క్లబ్ లో చేరిందన్న సమాచారం వెబ్ మీడియాలో గత వారమే సందడి చేసినప్పటికీ, దీనిపై ఎలాంటి అధికారిక సమాచారాన్ని చిత్రయూనిట్ అందించలేదు.
అయితే తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ విడుదల చేసిన ట్రైలర్ మాత్రం అక్కినేని వారి “సోకు”ను అద్భుతంగా చూపిస్తోంది. దీంతో అక్కినేని అభిమానులంతా ప్రస్తుతం “వాసి వాడి తస్సాదియ్యా” అనే నామంతో జపం చేస్తున్నారు. మరి వారి అభిమాన హీరో చేసిన రికార్డు అలాంటిదిలే! ఇక నుండి ఫ్యాన్స్ ఏం చేస్తారు… టిక్క డుం… టిక్క డుం… టిక్క డుం..!



