ప్రిన్స్ మహేష్ బాబు నుండి వచ్చిన ట్వీట్ తో అశేష అభిమానగణం రెట్టించిన ఉత్సాహంతో ఉరకలేస్తోంది. గత రెండు, మూడు రోజులుగా “స్పైడర్” చిత్ర యూనిట్ నుండి టీజర్ విషయంలో అధికారిక ప్రకటన వస్తుందని అభిమానులు భావిస్తున్నప్పటికీ, ఎవరూ స్పందించలేదు. అయితే సండే ఆఫర్ ప్రకటించిన ప్రిన్స్, టీజర్ విషయంలో స్పష్టత ఇస్తూ మే 31వ తేదీన సాయంత్రం 5 గంటలకు విడుదల అవుతుందని స్పష్టం చేసారు. దీంతో ఊహా లోకంలో ఊరేగడం ప్రిన్స్ అభిమానుల వంతవుతోంది.
అయితే ఇక్కడే మహేష్ బాబు ఓ అగ్ని పరీక్ష కూడా ఎదుర్కోబోతున్నారు. ఈ సినిమా ‘ఫస్ట్ లుక్’ పోస్టర్స్ విషయంలో అభిమానుల నుండి భిన్న స్పందనలు తలెత్తడంతో, టీజర్ ఎలా చేరువ ఉండబోతుందన్నది కీలకం కాబోతోంది. అందులోనూ ఈ టీజర్ కటింగ్ కోసం చాలా సమయం తీసుకోవడంతో, సినీ ప్రేక్షకులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు. ఒకవేళ ఆ అంచనాలను అందుకోవడంలో ‘ఫస్ట్ లుక్’ పోస్టర్స్ మాదిరే, టీజర్ కూడా విఫలం చెందితే “స్పైడర్”పై క్రేజ్ మరింత తగ్గే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి.
ఇప్పటివరకు మురుగదాస్ – మహేష్ కాంభినేషన్ అన్న ఒక్క అంశం పైనే ఇంత క్రేజ్ ఏర్పడింది. బుధవారం నాడు విడుదల కాబోతున్న టీజర్ తో “స్పైడర్”లోని అసలు విషయం బయట పడనుంది. ఒకవేళ ప్రిన్స్ అభిమాన గణం భావిస్తున్నట్లు టీజర్ గనుక అదిరిపోయే రేంజ్ లో ఉంటే, మహేష్ ప్రకటించిన దసరా సమయం వరకు అభిమానులు తట్టుకోవడం కాస్త కష్టమైన విషయమే కావచ్చు. అలాగే ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో సరికొత్త రికార్డులకు “స్పైడర్” వేదికగా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి.



