అనేక వాయిదాలు పడుతూ వస్తోన్న మురుగదాస్ – మహేష్ బాబుల సినిమా “స్పైడర్” ఎట్టకేలకు సెప్టెంబర్ లో విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ట్రేడ్ వర్గాల తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ 27వ తేదీన దసరా కానుకగా ఈ సినిమా విడుదల కానుందని తెలుస్తోంది. ఈ సినిమా విడుదల తేదీతో ఇతర సినిమాల రిలీజ్ డేట్ లకు కష్టాలు వచ్చిపడుతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ‘స్పైడర్’ మార్పుతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ సినిమాకు రిలీజ్ డేట్ కష్టాలలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం సెప్టెంబర్ లో ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేసుకోగా, ‘స్పైడర్’ కూడా అదే సెప్టెంబర్ లో విడుదలకు సిద్ధమవుతుండడంతో, పవన్ సినిమా విడుదలపై చిత్ర యూనిట్ మల్లగుల్లాలు పడుతోందట. ముఖ్యంగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఈ సినిమాను సోలోగా విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం. దసరా బరిలోకి ఇప్పటికే ‘స్పైడర్’ రాగా, అంతకుముందే బాలయ్య – పూరీల సినిమా కూడా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది.
ఒకవేళ దసరా కంటే ముందుగానే విడుదల చేస్తే… కొత్త సినిమాల రాకతో ఈ సినిమాను ప్రేక్షకులు పట్టించుకోరన్న భావనతో దసరా అయితేనే సరైన సమయంగా త్రివిక్రమ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారట. అదే నిజమైతే సంక్రాంతి పండగకు కూడా సాధారణంగా రెండు, మూడు పెద్ద సినిమాలు విడుదల అవుతుంటాయి. మరి అప్పుడు కూడా ‘సోలో’ రిలీజ్ కష్టమే కదా… అన్న టాక్ హల్చల్ చేస్తోంది.
వచ్చే సంక్రాంతికి కొరటాల శివ – మహేష్ బాబుల “భరత్ అనే నేను” సినిమా లైన్ లో ఉంది. అయితే ఈ సినిమా షూటింగ్ లో మహేష్ ఇంకా భాగస్వామి కాకపోవడంతో, సంక్రాంతికి రెడీ అవుతుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంటుంది. ఒకవేళ సిద్ధమైతే త్రివిక్రమ్ ఆశలు నెరవేరకపోవచ్చు. ఇదంతా మారిన ‘స్పైడర్’ విడుదల తేదీతో వచ్చిన చిక్కులు. ఇవన్నీ కాదనుకుంటే… ‘స్పైడర్’కు పోటీగా పవన్ బరిలోకి దిగుతాడేమో! చివరిసారిగా పవన్, మహేష్ లు ‘బంగారం, పోకిరి’ సినిమాల ద్వారా పోటీపడిన విషయం తెలిసిందే.



