ప్యాన్ ఇండియా సినిమాలు తీసే పద్దతి ఇదేనా

SSMB28_Game_Changer_Pan_Indiaబడ్జెట్ ఎంతైనా హీరో ఎవరైనా నిర్మాతలకు సరైన ప్లానింగ్ ఉండాలి. ఫలానా ఆర్టిస్టులతో ఫలానా టైంకంతా పూర్తి చేసి ఏ డేట్ కి రిలీజ్ చేయాలో ముందే నిర్ణయించుకుని ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే దానికే కట్టుబడి ఉండేలా ప్రణాళిక ఉండాలి. హాలీవుడ్, బాలీవుడ్ సంస్థలు ఈ విషయంలో పక్కాగా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ టార్గెట్ మిస్ అవ్వవు. ఉదాహరణకు షారుఖ్ ఖాన్ డుంకీ, హృతిక్ రోషన్ ఫైటర్ ల విడుదల తేదీలు ఏడాది ముందే అనౌన్స్ చేశారు. షూటింగు, పోస్ట్ ప్రొడక్షన్ అన్నీ షెడ్యూల్స్ ప్రకారమే అవుతున్నాయి.

టాలీవుడ్ లో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితి నెలకొంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఎప్పుడు వస్తుందో నిర్మాత దిల్ రాజే చెప్పలేకపోతున్నారు. దీనికన్నా చాలా ఆలస్యంగా మొదలైన మహేష్ బాబు 28 దర్జాగా జనవరి 13 తీసుకుని తాపీగా కూర్చుంది. ఇండియన్ 2 సంగతి తేలితే కానీ శంకర్ ఈ చరణ్ సినిమా ఎప్పుడు పూర్తి చేసేది బయటపడడు. అఖిల్ ఏజెంట్ సంగతీ ఇలాగే ఉంది. ఇంకో పాతిక రోజుల్లో రిలీజ్ పెట్టుకుని ఇంకా రెండు పాటలు బ్యాలన్స్ ఉన్నాయట. ఇప్పటికే విపరీతమైన వాయిదాలకు గురయ్యింది.

ADVERTISEMENT

దర్శకుడు సురేందర్ రెడ్డి నిర్మాత అనిల్ సుంకర్ మధ్య ఈ విషయంగానే ఏవో విభేదాలు వచ్చాయని ఆల్రెడీ కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజమో అబద్దమో ఏదీ తేల్చడం లేదు. దీనికి సమాంతరంగా అదే రోజు వస్తున్న పొన్నియన్ సెల్వన్ 2 తాలూకు ఆడియో ప్లస్ ట్రైలర్ లాంచ్ రెండూ జరిగిపోయాయి. కానీ ఏజెంట్ విషయంలో బుడ్డ టీజర్, రెండు పాటలు తప్ప ఎలాంటి కదలిక లేదు. పుష్ప 2 సంగతి సరేసరి. అల్లు అర్జున్ సుకుమార్ ల విలువైన ఏడాది కాలం కేవలం స్క్రిప్ట్ ఫైనల్ చేయడంలోనే గడిచిపోయింది.

జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో సైతం విపరీతమైన జాప్యానికి గురై సంవత్సరం తర్వాత సెట్స్ పైకి వెళ్ళింది. కారణాలు ఎన్నైనా ఉండొచ్చు సమర్ధింపులు ఎన్నయినా చేసుకోవచ్చు. కానీ దేనికైనా ఒక లిమిట్ ఉండాలిగా. తమ అభిమాన హీరోల సినిమాలే జీవితంలో అత్యంత ముఖ్యమైన వాటిలో ఒకటిగా భావించే కోట్లాది ఫ్యాన్స్ మనోభావాలు పరిగణనలోకి తీసుకోవాలి. ఇకపైన ఈ పద్దతి మారాలి. వేగం పెరగాలి. అందరూ రాజమౌళిలాగా ఏళ్లకేళ్లు సినిమాలు చెక్కుతూ కూర్చుంటే కొత్త జనరేషన్ టైర్ 1 స్టార్లు కెరీర్ మొత్తంలో యాభై సినిమాలు చేయడం అసాధ్యం. ఈ లెక్కన చిరంజీవి బాలకృష్ణను వందా నూటాయాభై ఎలా చేశారబ్బా అనే భేతాళ ప్రశ్న తలెత్తుంది.

ADVERTISEMENT
Latest Stories