ధియేటర్లలో ఆదరణ ఎలా ఉన్నా వారం, రెండు వారాలకే ఓటీటీలో సినిమా వచ్చేస్తున్న రోజులివి. పెద్ద హీరోల సినిమాలైతే మూడు, నాలుగు వారాలకు స్మాల్ స్క్రీన్ పైన ప్రత్యక్షం అవుతున్న నేపధ్యంలో త్వరలోనే వీటిపైన ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా టాలీవుడ్ ఏస్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రకటించారు.
తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓటీటీ రిలీజ్ పై స్పందించిన దిల్ రాజు, “పుష్ప మూడు వారాలకే విడుదల కావడం అనేది ఆర్ఆర్ఆర్ రిలీజ్ అవుతుందని అనుకున్నారు, అందుకే ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ ఆర్ఆర్ఆర్ వాయిదా పడుతుందని అస్సలు ఊహించలేదని” అన్నారు.
ధియేటర్ లలో తర్వాత ఓటీటీ రిలీజ్ గురించి ప్రస్తుతం ప్రొడ్యూసర్స్ గిల్డ్ లో చర్చలు జరుగుతున్నాయని, 50 రోజులు పూర్తయిన తర్వాత పెద్ద హీరోల సినిమాలు ఓటీటీలో విడుదల అయ్యే విధంగా, చిన్న హీరోల సినిమాలు 5 వారాలు పూర్తయిన తర్వాత ఓటీటీలో వదలడానికి నిర్ణయం జరుగుతున్నట్లుగా తెలిపారు.
50 రోజుల వరకు ఓటీటీలో రాదనుకుంటే ప్రేక్షకులు ధియేటర్లకు వస్తారని, మూడు వారాల్లో వచ్చేస్తుందని తెలిస్తే ప్రేక్షకులు ధియేటర్ కు ఎందుకు వస్తారు, రారని దిల్ రాజు కుండబద్ధలు కొట్టారు. దీని ద్వారా ధియేటర్లను మేమే డామేజ్ చేసుకుంటున్నామని, అందుకే ఓటీటీపై నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు.
బాహుబలి 1 & 2 తర్వాత తెలుగు సినిమా మార్కెట్ బాగా పెరిగిందని, ‘పుష్ప’తో అల్లు అర్జున్ మరియు ‘ఆర్ఆర్ఆర్’ ద్వారా రామ్ చరణ్ & ఎన్టీఆర్ లు కూడా బాలీవుడ్ కు బాగా చేరువ అయ్యారని, త్వరలో విజయ్ దేవరకొండ ‘లైగర్’ ద్వారా వెళ్తున్నాడని, ఈ లైన్ లోనే మహేష్ కూడా ఉన్నారని దిల్ రాజు చెప్పారు.
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తాను నిర్మిస్తోన్న సినిమా 2023 సంక్రాంతి రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నామని అన్నారు. ఈ సినిమా శంకర్ స్టైల్ లోనే సోషల్ ఎలిమెంట్స్ తో కూడి ఉంటుందని, తెలుగులో షూట్ చేస్తూనే తమిళ, హిందీ భాషలలో డబ్ చేస్తూ పాన్ ఇండియా మూవీగానే రిలీజ్ చేస్తున్నామని అన్నారు.