ఏప్రిల్ 29న వెలువడిన ఎగ్జిట్ పోల్స్ తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని అధికార డీఎంకే ఎన్నికలలో గెలిచి అధికారం చేపట్టడం ఖాయమని సూచించాయి. ఒకటి రెండు సర్వేలు మాత్రం 234 సీట్లకి టివికే పార్టీకి 120 లేదా కొంచెం ఎక్కువ సీట్లు రావచ్చని పేర్కొన్నాయి.
ఆ తర్వాత కాస్త ఆలస్యంగా వెలువడిన సర్వేలో టివికే పార్టీ పూర్తి మెజార్టీతో అధికారంలోకి రాబోతోందని ప్రకటించడంతో ఒక్కసారిగా తమిళనాడులో రాజకీయాలు వేడెక్కిపోయాయి.
దీంతో ఆ పార్టీ అధినేత ఎన్నికలలో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్ధులతో అత్యవసర సమావేశం నిర్వహించి, ఫలితాలు వెలువడగానే గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ తక్షణం చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం చేరుకోవాలని ఆదేశించారు. అక్కడి నుంచి వారందరినీ మహాబలిపురంలోని పూంజేరీ రిసార్ట్ తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడక మునుపు ఇటువంటి పరిణామాలు సర్వసాధారణమే.
కానీ తమిళనాడులోని రాజకీయ బలాబలాలు, కుల సమీకరణాలు పరిగణనలోకి తీసుకొని చూస్తే సర్వేల ప్రకారం అధికార డీఎంకే కనీసం బొటాబొటి మెజార్టీతోనైనా ఎన్నికలలో గెలిచే అవకాశం కనిపిస్తోంది.
కానీ తొలిసారిగా ఎన్నికలలో పోటీ చేసిన టివికే పార్టీ పూర్తి మెజార్టీతో అధికారంలోకి రాబోతోందని జోరుగా ప్రచారం సాగుతుండటం, అందుకు తగ్గట్లు ఆ పార్టీ అధినేత విజయ్ హడావుడి చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఒకవేళ టివికే పార్టీకి పూర్తి మెజార్టీతో అధికారంలోకి వస్తే పర్వాలేదు. కానీ రెండు పార్టీలకు లేదా మూడు పార్టీలకు సమానంగా సీట్లు లభిస్తే ఇలాంటి ముందస్తు జాగ్రత్త చాలా అవసరమే. లేకుంటే గెలిచిన ఎమ్మెల్యేలు అటు నుంచి ఆటే వేరే పార్టీలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది.
కొన్ని సర్వేలు సూచించినట్లుగా ఒకవేళ టివికే పార్టీకి 20-25 సీట్లు మాత్రమే వస్తే గెలిచిన ఎమ్మెల్యేలందరూ కాస్త ముందో వెనకాలో గోడ దూకేయడం ఖాయం. కనుక పూర్తి మెజార్టీతో గెలిపించమని లేదా కనీసం 120కి తక్కువ కాకుండా సీట్లు ఇమ్మనమని భగవంతుడిని ప్రార్ధిస్తే మంచిది.




