ఈ మధ్యకాలంలో తరచూ వార్తలలో కనిపిస్తున్న అంశం ఆత్మహత్యలు. చదువుల భారం మోయలేక, పని ఒత్తిడి తట్టుకోలేక, అనుకున్నవి పొందలేక, ప్రేమ వివాదాలు, పెళ్లి విభేదాలు, అక్రమ సంబంధాలు, ఆర్థిక ఇబ్బందులు ఇలా కారణం ఏదైనా కానీ ఆ ఒత్తిడిని అధిగమించి కొంతమంది ముందుకెళ్లలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
ర్యాంకుల కోసం తల్లితండ్రులు జీవితం మీద ఎటువంటి అవగాహన లేని పసిహృదయాలను సైతం హాస్టల్స్ పేరుతో చదువుల బందిఖానాలో పడేస్తున్నారు. తల్లితండ్రులకు దూరమై ఉపాధ్యాయుల చదువు ఒత్తిడ్లలో నలిగి పోతున్న కొంతమంది అమాయక విద్యార్థులు ఆ భారాన్ని తమ భుజాన మోయలేక ప్రాణాలు తీసుకుంటున్నారు.
అయితే ఇక్కడ ఈ పాపం ఎవరిదీ.? పొద్దున్న లేస్తే పుస్తకాలు తప్ప మరొకటి లేకుండా చేస్తున్న పాఠశాల యాజమాన్యాలదా.? లేక తల్లితండ్రుల చేయూత అవసరమైన సమయంలో వారిని ర్యాంకుల పేరుతో బందీలుగా మారుస్తున్న తల్లితండ్రులదా.? లేదా ఈ పోటీ ప్రపంచాన్ని అర్ధం చేసుకోలేని విద్యార్థులదా.?
ఇక ఆర్థిక ఇబ్బందులు తాళలేక, పని ఒత్తిడిని తట్టుకోలేక మరికొంతమంది ఈ బలవన్మరణాలను ఆశ్రయిస్తున్నారు. ఇక్కడ దోషం ఎక్కడుంది.? ఆర్థిక పరిస్థితులను అంచనా వేయకుండా గొప్పల కోసమో, ఆర్భాటాలు కోసమో స్థాయికి మించి ఖర్చులు చేసి అప్పులు చేస్తున్న వారిని దోషిగా చూపించాలా.? లేక ఆ ఆర్భాటాలు లేకపోతే సమాజంలో గుర్తింపు, గౌరవం ఉండదు అనే భావనను సృష్టించిన సమాజాన్ని ద్వేషించాలా.?
ప్రేమ వ్యవహారాలు, పెళ్లి విభేదాలు ఈ బలవన్మరణాలకు ముఖ్య కారణాలు. పెద్దలు తమ ప్రేమను అంగీకరించలేదని, వారిని ఒప్పించేంత ఓపిక లేక కొంతమంది, పిల్లల ఇష్టా ఇష్టాల కంటే కూడా కులానికి, మతానికి, ఆర్థిక వ్యవహారాలకు విలువనిచ్చే పెద్దలు తమ పిల్లల ప్రాణాలను బలి కోరుతున్న సంఘటనలు చూస్తున్నాం.
అలాగే భర్త మీద కోపం, భార్య మీద అనుమానం అంటూ కొంతమంది, ఇక బార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న మనస్పర్ధలను సైతం బూతద్దంలో పెట్టి ఆ కారణంగా ప్రాణాలు తీసుకుంటున్న జంటల కథలు వింటున్నాం. అయితే ఇక్కడ తప్పెవరిది.? క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటున్న జంటలదా.? లేక వారిని మోటివేట్ చేయలేకపోతున్న పెద్దలదా.?
సమస్య ఎటువంటిదైనా కానీ దాని పరిష్కారం మాత్రం మరణం కాకూడదు. బలవన్మరణాలతో ఆయా కుటుంబాలు పడే మానసిక వేదనకు అంతం ఉండదు. సమస్య పరిష్కారానికి వివిధ దారులు వెతకాలే తప్ప ప్రాణాలు తీసుకోకూడదు. విద్యార్థి దశ నుంచే ఒత్తిడిని ఎదుర్కునే విధంగా వారిని తీర్చిదిద్దాల్సిన బాధ్యత అటు ఉపాధ్యాయులతో పట్టు ఇటు తల్లితండ్రుల బాధ్యతగా ఉండాలి.







