హీరోలకి ఫ్యాన్స్ & ఫ్యాన్ బేస్ ఉండడం అనేది చాలా కీలకం. జంధ్యాల, దాసరి, రాఘవేంద్రరావు, ఈవీవీ, పూరి జగన్నాథ్, రాజమౌళి వంటి దర్శకులు వాళ్ళకంటూ ఉన్న ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ తోనే సినిమాలో నటించే స్టార్ హీరోతో సంబంధం లేని ఓపెనింగ్స్ సంపాదించారు. అయితే ఆ ఫ్యాన్ బేస్ అనేది ఒకట్రెండు సినిమాలతో రాదు, వరుసబెట్టి చేసే సినిమాలన్నీ ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తేనే క్రియేట్ అవుతుంది.
అలా తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకోగల సత్తా కానీ లక్షణాలు కానీ పుష్కలంగా ఉన్న సుజీత్, కేవలం సినిమాకి సినిమాకి మధ్య తీసుకునే గ్యాప్ కారణంగా స్టార్ డైరెక్టర్ హోదా ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. నిజానికి “రన్ రాజా రన్” తర్వాత ప్రభాస్ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం దక్కించుకోవడం, అది కూడా “బాహుబలి” లాంటి ఇండియన్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అనేది మామూలు విషయం కాదు.
“సాహో” ఊహించిన స్థాయిలో ఆడకపోయినా, ఆ సినిమాలో ప్రభాస్ ను స్టైలిష్ గా ప్రెజంట్ చేసిన విధానాన్ని, యాక్షన్ బ్లాక్ ను కొరియోగ్రఫీ చేయించుకున్న విధానాన్ని తప్పుబట్టినవాళ్లు మాత్రం లేరు. కాకపోతే.. భారీ హిట్ అందుకోలేక చతికిలపడ్డాడు. “రన్ రాజా రన్” తర్వాత అయిదేళ్లకి “సాహో” చేస్తే, ఆ తర్వాత మూడో “ఓజీ” రిలీజ్ అవ్వడానికి ఏకంగా ఆరేళ్లు పట్టింది.
పోనీ “ఓజీ” తర్వాతైనా వెంటనే మరో సినిమా చేస్తాడు అనుకుంటే, నానితో సినిమా అఫీషియల్ గా అనౌన్స్ చేయించుకోవడానికే చాలా టైమ్ పట్టింది. ఇప్పుడు నాని కూడా “ప్యారడైజ్” షూట్ లో బిజీగా ఉండడం, ఆ సినిమా బడ్జెట్ ఇష్యూస్ & షెడ్యూల్స్ ప్లానింగ్ కారణంగా పలుమార్లు వాయిదాపడుతూ ఉండడంతో, నానికి గెటప్ మార్చే స్కోప్ లేక సుజీత్ మళ్లీ పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం కేటాయిస్తూ టైమ్ పాస్ చేస్తున్నాడు.
ఒక రైటర్ గా, డైరెక్టర్ గా సుజీత్ స్టైల్ ఆఫ్ మేకింగ్ ని ఇష్టపడేవాళ్లు కోకొల్లలు. అయితే.. ఇలా ప్రతి సినిమాకి ఇన్నేళ్ల గ్యాప్ అనేది అతడ్ని మెయిన్ స్ట్రీమ్ డైరెక్టర్ అవ్వనివ్వకుండా ఆపుతుంది. ఈ విషయంలో సుజీత్ కాస్త ప్లానింగ్ మార్చుకుని చురుగ్గా సినిమాలు చేస్తే బెటర్.






