హైదరాబాద్, రవీంద్ర భారతిలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు చేస్తే తెలంగాణ వాదులు అభ్యంతరం తెలిపారని చాలా మంది బాధ పడ్డారు. కానీ మన ఆంధ్రా నడిబొడ్డున పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం ఏర్పాటు చేస్తే దానినీ తొలగించే ప్రయత్నం చేయడాన్ని ఏమనుకోవాలి?
కృష్ణ అభిమానులు ముందుగానే మున్సిపల్ కార్యాలయంలో అనుమతి తీసుకొని ఈ ఏడాది ఏప్రిల్ 12న భీమవరం పట్టణంలో ఎడ్వర్డ్ ట్యాంక్ వద్ద సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం ఏర్పాటు చేశారు. ఇన్ని నెలల తర్వాత ఇప్పుడు అక్కడి నుంచి ఆ విగ్రహం తొలగించాలంటూ మున్సిపల్ అధికారులు కృష్ణ అభిమాన సంఘానికి నోటీస్ పంపారు.
విగ్రహం ఏర్పాటుకి అనుమతిస్తూ జారీ చేసిన నిరభ్యంతర పత్రాన్ని వారు చూపినా అంగీకరించలేదు. తక్షణం తొలగించాల్సిందేనన్నారు. అందుకు కృష్ణ అభిమానులు అంగీకరించకపోవడంతో మున్సిపల్ సిబ్బంధి విగ్రహం తొలగించేందుకు వచ్చారు. వారిని కృష్ణ అభిమానులు అడ్డుకున్నారు.
కృష్ణ విగ్రహం తొలగించకుండా అడ్డుకునేందుకు కృష్ణ అభిమాన సంఘం నాయకుడు రాయప్రోలు శ్రీనివాసమూర్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం విగ్రహం ఏర్పాటుకి అనుమతి ఉందనే విషయం గుర్తించింది. కనుక తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు అక్కడి నుంచి సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం తొలగించరాదని స్టే ఉత్తర్వులు జారీ చేసింది.
వందల తెలుగు సినిమాలలో నటించి కోట్లమంది తెలుగు ప్రేక్షకులను మెప్పించిన గొప్ప నటుడు సూపర్ స్టార్ కృష్ణ. ఆరోజుల్లోనే సినీ రంగంలో అనేక నూతన ఆవిష్కరణలు, ప్రయోగాలు చేసి టాలీవుడ్ పేరు దేశంలో మారుమ్రోగిపోయేలా చేసిన గొప్ప వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ.
అలాంటి గొప్ప వ్యక్తి విగ్రహం పెట్టుకోవడం మన గొప్పదనాన్ని మనం గౌరవించుకోవడమే అవుతుంది. కానీ ఆయన విగ్రహం తొలగించకుండా అడ్డుకునేందుకు హైకోర్టులో న్యాయపోరాటం కూడా చేయాల్సిన దౌర్భాగ్యం దాపురించింది!
పొరుగు రాష్ట్రంలో ఆంధ్రా ప్రముఖుల విగ్రహాలు వద్దనుకోవడం అర్ధం చేసుకోవచ్చు. మన ఆంధ్ర రాష్ట్రంలో మన అందరికీ గర్వకారణమైన గొప్ప నటుడు సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం ఏర్పాటు చేస్తే అందుకు సంతోషపడాలి కానీ ఎందుకు తొలగించాలనుకున్నట్లు?







