తెలంగాణ రాజకీయంలో కీలక భాగం టీడీపీ పార్టీ చుట్టూ తిరుగుతూ ఉంటే, రేవంత్ – కేటీఆర్ మధ్య ముఖ్య ఘట్టాలు బాబు కేంద్రంగా సాగుతున్నాయి. అటు అధికార పక్షం కాంగ్రెస్ నుంచి ఇటు ప్రతిపక్షం బిఆర్ఎస్ వరకు టీడీపీ కేంద్రంగానే రాజకీయాలు చేస్తున్నాయి.
అసలు తెలంగాణలో టీడీపీ ఉనికే లేదు అంటూ డాబులు కొట్టే బిఆర్ఎస్ తెలంగాణలో టీడీపీ కేంద్రంగా తన రాజకీయానికి బాటలు వేసుకుంటుంది. అందులో భాగంగానే ఒక పక్క బనకచర్ల పై బాబు పై విమర్శలు చేస్తున్న కేటీఆర్, మరోపక్క తెలంగాణలో బిఆర్ఎస్ గెలుపు కోసం నారా లోకేష్ తో మంతనాలు చేస్తున్నారు అంటూ కాంగ్రెస్, టీడీపీ – బిఆర్ఎస్ ల బంధం పై ఎదురుదాడి చేస్తుంది.
ఇందుకు కాంగ్రెస్ నాయకుడు సామ రామ్మోహన్ రెడ్డి మొదలుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు టీడీపీ సైకిల్ సాక్షిగా బిఆర్ఎస్ కారును టార్గెట్ చేస్తున్నారు. ఇక బిఆర్ఎస్ విషయానికొస్తే, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటూ బాబు కోవర్ట్ గా, టీడీపీ ఏజెంట్ గా ఏపీ ప్రయోజనాల కోసం రేవంత్ పని చేస్తున్నాడంటూ కేటీఆర్ కాంగ్రెస్ మూడు రంగుల జెండాకు పసుపు మరకలు వేస్తున్నారు.
ఇక ప్రస్తుతానికి ఏ పార్టీలో ఉన్నారో తెలియని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ, జాగృతి ఫౌండర్ కవిత కూడా తన సొంత రాజకీయ ఎదుగుదలకు కోసం టీడీపీ పార్టీనే నమ్ముకుంది. టీడీపీ కేంద్రంగా అటు కాంగ్రెస్ ను ఇటు బిఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ కవిత తెలంగాణ రాజకీయాలను జాగృతం చేస్తున్నారు.
ఇలా తెలంగాణ ప్రముఖ రాజకీయ వాదులంతా అసలు తెలంగాణలో ప్రస్తావనే లేని టీడీపీ చుట్టూ రాజకీయం చేస్తూ వారి పార్టీ బలాన్ని, వారి వ్యక్తిగత ఇమేజ్ ను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే అటు ఏపీ కూటమి ప్రభుత్వంలో భాగంగా అధికారంలో ఉన్న బీజేపీ, ఇటు తెలంగాణలో అధికారం కోసం కొట్లాడుతుంది. అయితే రెండు రాష్ట్రాలలో రాజకీయంగా యాక్టీవ్ గా ఉన్న బీజేపీ ని వదిలి కాంగ్రెస్, బిఆర్ఎస్ లు టీడీపీ వైపు ఎందుకు మొగ్గుచూపుతున్నట్టు.?
ఇదంతా కూడా వారికీ టీడీపీ పట్ల ఉన్న భయమనుకోవాలా.? లేక అభద్రతా భావం అనుకోవాలా.? లేక పసుపు జెండా మీద ఉన్న అక్కసు గా భావించాలా.? లేదంటే టీడీపీ పార్టీ పై విమర్శలు లేకుండా బిఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రాదు అనే భావన తెలంగాణ భవన్ లో కనిపిస్తుందా.?
సైకిల్ సైన్యాన్ని కాదని రేవంత్ ముందుకెళ్లగలడు అనే భావన కాంగ్రెస్ భవన్ లో వినిపిస్తుందా.? మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ హస్తం పైకి లేగవాలన్నా- బిఆర్ఎస్ కారు షెడ్ నుంచి బయటకు రావాలన్న టీడీపీ సైకిల్ కావాల్సిందేనా.? ఈ రెండు పార్టీల రాజకీయంలో టీడీపీ కింగ్ మేకర్ కానుందా.? అన్న ప్రశ్న తెలంగాణ రాజకీయాలలో చర్చనీయాంశం అవుతుంది.




