క్రూర మృగాలు అడవిలో సాధు జంతువులను చంపి కడుపు నింపుకోక తప్పదు. అయితే మన నాగరిక ప్రపంచంలో సాధు జంతువుల వంటి సామాన్య ప్రజలు కూడా నిత్యం ఈవిధంగా దోపిడీకి గురవుతూనే ఉంటారు.
ఇంకా విచారకరమైన విషయం ఏమిటంటే, మళ్ళీ ఆ సామాన్య ప్రజలు కూడా మనుగడ కోసం వారిలో వారు పోటీ పడక తప్పని దుస్థితి నెలకొని ఉండటమే!
ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పధకంతో రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో, ఆటోరిక్షాలు నడుపుకొని జీవనం సాగించేవారు ఆ మేరకు ఆదాయం కోల్పోయారు.
వారికి ప్రభుత్వాలతో పోరాడగల శక్తి గలవారు కారు. అయినా తమ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళగలిగారు. ప్రభుత్వం వారిని శాంతింపజేసేందుకు ఓలా, ర్యాపిడో, ఊబర్ వంటి బైక్/స్కూటీ సర్వీసులు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న వారిపై ఆంక్షలు విధించింది. వారి వాహనాలకు పసుపు రంగు నంబర్ ప్లేట్స్ తప్పనిసరి చేసింది.
అయితే ఇవేమీ శాశ్విత ఉద్యోగాలు కావు. హాస్టళ్ళలో ఉంటూ చదువుకునే విద్యార్ధులు, ప్రభుత్వోద్యోగాలకు కోచింగ్ తీసుకునేందుకు నగరానికి వచ్చిన నిరుద్యోగులు, కుటుంబ పోషణ కోసం గృహిణులు వంటి అనేక మంది ఈ సంస్థలలో పార్ట్ టైమ్ లేదా తాత్కాలికంగా పనిచేస్తుంటారు.
కనుక వారందరూ తమ వాహనాలను కమర్షియల్ వాహనాలుగా మార్చుకుంటేనే పసుపు రంగు నంబర్ ప్లేట్స్ పెట్టించుకో గలుగుతారు. వ్యక్తిగత అవసరాలకు వాడే వాహనాలతో పోలిస్తే కమర్షియల్ వాహనాల రిజిస్ట్రేషన్ ఛార్జీలు, రోడ్ టాక్స్ తదితర ఛార్జీలన్నీ కాస్త ఎక్కువగానే ఉంటాయి.
కనుక బైక్/స్కూటీల నడిపించడం ద్వారా వచ్చే కొద్దిపాటి ఆదాయం కోసం వాటిని మార్చుకోలేరు. ప్రభుత్వ ఆంక్షల కారణంగా పసుపు రంగు నంబర్ ప్లేట్స్ లేని వాహనాలను ఆయా సంస్థలు అంగీకరించకపోవచ్చు. ఒకవేళ అవి చూసిచూడనట్లు వదిలేసినా ట్రాఫిక్ పోలీసులు, ఆటో రిక్షా డ్రైవర్లు ఊరుకోరు.
కనుక ఇంతకాలం బైక్/స్కూటీలతో కొద్దిగా ఆదాయం సంపాదించుకుంటున్న నిరుద్యోగులకు ఈ చిన్న ఆదాయ మార్గం కూడా కోల్పోయే ప్రమాదం కనిపిస్తోంది.
కానీ ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు పధకం వలన ఆదాయం కోల్పోయిన తాము, ఈ బైక్ టాక్సీలతో కూడా తీవ్రంగా నష్టపోతున్నామని ఆటోరిక్షా డ్రైవర్లు వాదన సహేతుకమే. కానీ బైక్ టాక్సీ నడుకొని జీవనం సాగించేవారి పరిస్థితి? కనుక ఇది నాట్ జస్ట్ ఎల్లో నంబర్ ప్లేట్స్ ఇష్యూ.. సమాజంలో రెండు సామాన్య వర్గాల జీవనపోరాటం. ఎవరిని కాపాడాలి? ఎవరి కోసం ఎవరిని శిక్షించాలి? కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అంటే ఇదేగా!





