టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధరించే చొక్కా రంగు ఏది? అని అడిగితే… ఏ మాత్రం తడుముకోకుండా తెలుపు రంగు అన్న సమాధానం వస్తుంది. అవును… కేసీఆర్ తెలుపు రంగు చొక్కాలో మాత్రమే దర్శనమిస్తారు. ఈ రంగు చొక్కా కాకుండా మరే ఇతర రంగు షర్టులో కేసీఆర్ ను చూసిన సందర్భాలు లేవు. అయితే అంతర్రాష్ట్ర మండలి సమావేశానికి హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన సందర్భంగా కేసీఆర్ తన చొక్కా రంగు మార్చేశారు.
తెలుగుదేశం పార్తీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ధరించే గోధుమ రంగు చొక్కా తరహాలో, కాస్తంత లైట్ గోధుమ రంగు చొక్కాలో కేసీఆర్ దర్శనమిచ్చారు. ఖద్దరు కాని గోధుమ రంగు గుడ్డతో కుట్టిన సదరు షర్ట్ లో, సోమవారం నాడు తన విడిది నుంచి బయటకు వచ్చిన కేసీఆర్… ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. కేసీఆర్ తో భేటీ సమయంలో మోడీ కూడా గోధుమ రంగు కుర్తాలోనూ దర్శనమివ్వడం గమనార్హం.



