కాంగ్రెస్ పార్టీ అనగానే పార్టీలో ఉండే అంతర్గత కుమ్ములాటలు, బహిరంగ బలప్రదర్శనలు, సొంత పార్టీ లోనే అసమ్మతి మంటలు…ఇవే అందరికి ఎక్కువగా గుర్తుకొస్తాయి. అయితే ఈ నమ్మకమే తెలంగాణ రాజకీయాలలో ఒక రకంగా బిఆర్ఎస్ ను ముందుకు నడుపుతుంది అంటే అతిశయోక్తి కాదేమో.
రేవంత్ సర్కార్ ఏర్పడిన తొలినాళ్లలోనే ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని, కాంగ్రెస్ అధికార ముచ్చట మూన్నాళ్లకే పరిమితం అంటూ బిఆర్ఎస్ నేతలు బహిరంగానే ప్రకటనలు చేసారు, అందుకు తగ్గట్టే చాల పెద్దపెద్ద కలలు కూడా కన్నారు.
కానీ కట్ చేస్తే రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ ఆశలు మీద గులాబీ కారెక్కించేసారు. టీడీపీ వలస నేతగా కాంగ్రెస్ లో అడుగుపెట్టిన రేవంత్ తన కష్టంతో, పార్టీ గెలుపు కోసం బిఆర్ఎస్ తో చేసిన రాజకీయ యుద్ధంతో ఇటు తెలంగాణ ప్రజల ఓట్లతో పాటుగా అటు పార్టీ అధిష్టానం ఆశీస్సులు కూడా దక్కించుకున్నారు.
టి.కాంగ్రెస్ లో సీనియర్ నేతలందరినీ పక్కన పెట్టి కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ వైపు మొగ్గు చూపినా టి. కాంగ్రెస్ లో ఇన్నాళ్లు ఆధిపత్య కుమ్ములాటలు జరగలేదు. అలాగే పార్టీ లో అసమ్మతి నేతల స్వరం బయటకు రాలేదు, ఇక పార్టీకి రాజీనామాలంటూ, లేదు లేదు రాజీ పడిపోతాం అంటూ మీడియాలో రచ్చలు లేవు.
మంత్రి పదవి కోసం బాహాబాహీ బహిరంగ యుద్దాలు జరగలేదు, ఒకరి పై మరొకరి ఆధిపత్యం అంటూ బహిరంగ విమర్శలు వినలేదు. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవితో రేవంత్ సర్కార్ లో మొదలైన రాజకీయం ఇప్పుడు సినీయర్ నేత జీవన్ రెడ్డి రాజీనామా వరకు వెళ్ళింది.
అలాగే మరోపక్క సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి విభేదాలు అంటూ ప్రచారాలు మొదలయాయి, అలాగే అందుకు తగ్గట్టే కోమటిరెడ్డి తన శాఖ కార్యక్రమాలకు దూరంగా ఉండడం ఈ ప్రచారాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి.
ఇక మహిళా మంత్రి కొండా సురేఖ తరచుగా ఏదోఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వంలో ఉన్న పార్టీ పరమైన అంతర్గత విభేదాలను మీడియా ముందుకు తెస్తున్నారు. జీవన్ రెడ్డి రాజీనామాతో మొదలైన కాంగ్రెస్ రాజకీయం రేవంత్ రెడ్డి పై పోరు వరకు వెళ్లనుందా.?
కోమటిరెడ్డి బ్రదర్స్ మంత్రి పదవి తో తగులుకున్న వివాదం ముఖ్యమంత్రి పదవి వరకు చేరుతుందా.? రేవంత్ పార్టీలో మొదలైన ఈ అంతర్గత విభేదాలను జీవన్ రెడ్డి రాజీనామాతో సద్దుమణిగిస్తారా.? లేదా మిగిలిన వివాదాలను కూడా రచ్చకెక్కే వరకు వేచి చూస్తారా.?




