ఏపీకి నిర్మాతలు…తెలంగాణకు ఫెడరేషన్ నాయకులు..

Telugu film producers and federation leaders meeting over film workers strike in Andhra and Telangana

ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ రెండు, తెలుగు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ తెలుగు సినీ ఇండస్ట్రీ మాత్రం ఇప్పటి వరకు ఒకటిగానే కొనసాగుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు వినోదాన్ని అందిస్తుంది, రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరిస్తుంది.

అయితే గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో మొదలైన సినీ కార్మికుల సమ్మె రోజు రోజుకి ముదిరి పాకాన పడుతున్నట్టుగా కనిపిస్తుంది. వేతనాలు పెంపు అంటూ మొదలైన సినీ కార్మికుల సమ్మె టాలీవుడ్ ని దాటి, పరిశ్రమ పెద్దలను తప్పుకుని ఇప్పుడు ప్రభుత్వాల చుట్టూ తిరుగుతుంది.

ADVERTISEMENT

గతంలో మాదిరి ఇండస్ట్రీలో సమస్య ఎదురైతే ఆ సమస్యను పెద్దన్న పాత్రలో సామరస్య పూర్వకంగా పరిష్కరించే వ్యక్తులు లేకపోవడం ఈ సమస్యను మరింత జటిలంగా మారుస్తుంది. అయితే సమస్య పరిష్కారం కోసం నేడు ఏపీలోని అమరావతికి చేరుకున్నారు ఇండస్ట్రీలోని ప్రముఖ నిర్మాతలు.

ఇక అదే సమస్య పరిష్కారం కోసం చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తున్నారు ఫిలిం ఫెడరేషన్ నాయకులు. ఇందుకుగాను తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని కలవనున్నారు ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్, మరికొంతమంది ఫెడరేషన్ సభ్యులు.

ఇక ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ను కలిసేందుకు నిర్మాత దిల్ రాజు తో కలిసిన 14 మంది సినీ నిర్మాతల బృందం అమరావతి కి చేరుకున్నారు. ఇలా నిర్మాతలు ఒక దిక్కున ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షులు మరో దిక్కున సమస్య పరిష్కారం కోసం యత్నిస్తుంటే ఏ దిక్కు తోచక పరిశ్రమ పెద్దలు మౌనంగా ఉంటూ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు.

బాహుబలితో టాలీవుడ్ స్థాయి పాన్ ఇండియాకు అక్కడి నుంచి పాన్ వరల్డ్ కు చేరుకున్న ఇటువంటి సమయంలో పరిశ్రమలో ఎదురవుతున్న సమస్యలను జటిలం చేసుకుంటూ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎం జరుగుతుంది.? టాలీవుడ్ లో సంక్షోభం అంటూ ప్రచారాలు జరగడం అది టాలీవుడ్ స్థాయికి అవరోధంగా మారదా.?

కాస్టింగ్ కౌచ్ అంటూ కొన్నాళ్ళు, ఇండస్ట్రీలో తెలుగు వారికీ అవకాశం లేదా అంటూ కొన్నాళ్ళు , మా అధ్యక్ష ఎన్నికల రచ్చ తో మరికొన్నాళ్లు, టికెట్ రేట్ల పంచాయితో కొన్నాళ్ళు, పుష్ప వివాదం ఇంకొన్నాళ్ళు టాలీవుడ్ ను వార్తలో ఉంచింది. ఇప్పుడు సినీ కార్మికుల వేతనాల పెంపు సమ్మె తెలుగు సినీ పరిశ్రమను నలుగురు నోళ్ళలో నలిగేలా చేస్తుంది.

మొన్న ధియేటర్ల బందు అంటూ ఇండస్ట్రీలో రచ్చ నడిస్తే, నేడు షూటింగ్ ల బందు అంటూ రచ్చ మొదలయ్యింది. ఇప్పటికైనా ఈ సమస్య పరిష్కారానికి ఇరు వర్గాలు ముందుకొచ్చి తెలుగు సినీ పరిశ్రమను సంక్షోభం నుంచి బయటకు తీసుకురావాలి.

ADVERTISEMENT
Latest Stories