స్థానిక సంస్థల ఎన్నికల కోసం టీడీపీ ప్రభుత్వం బీసీలకు 34% రిజర్వేషన్ అంశాన్ని తెరమీదకు తెచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల సమరంలో బీసీలకు 34% రిజర్వేషన్ మేరకు సీట్లు కేటాయిస్తామని, అందుకోసం అవసరమైతే న్యాయపోరాటానికి సైతం సిద్ధమంటూ టీడీపీ ప్రకటించింది.
అందుకు తగ్గట్టే ఈ అంశం పై సుప్రీంకోర్టు ను ఆశ్రయించింది. అయితే కోర్ట్ తీర్పు ఎలా ఉన్నప్పటికీ పార్టీ పరంగా అయినా ఇచ్చిన మాట మేరకు బీసీ లకు 34% రిజ్వేషన్ అమలు చేసి తీరుతాం అంటూ బాబు నుంచి లోకేష్ వరకు బల్లగుద్ది మరి ప్రకటిస్తున్నారు.
అయితే టీడీపీ వైఖరి ఇలా ఉంటే అటు వైసీపీ ఈ నెల 16 న విశాఖపట్నం లో ‘ఉత్తరాంధ్ర బీసీ గర్జన’ పేరుతో భారీ బహిరంగ సభను ప్రకటించింది. అయితే వైసీపీ బీసీ గర్జన సభకు ఉత్తరాంధ్ర ను ఎంచుకోవడం పై, పేరులో కూడా ఉత్తరాంధ్ర అనే పదం ఉండేలా చూసుకోవడంలో వైసీపీ ఎందుకంత ఆసక్తి చూపిస్తుంది.
బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శీను రాజీనామాతో ఉత్తరాంధ్రలో వైసీపీ రాజకీయంగా కుదేలయిపోయింది, చిన్న శీను రాజీనామ తరువాత ఉత్తరాంధ్ర వైసీపీ లో జరిగిన రాజకీయ పరిణామాలతో అసలు ఉత్తరాంధ్రలో వైసీపీ రాజకీయంగా బతికే ఉందా.? అంటూ సొంత పార్టీ శ్రేణుల నుంచే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
వైసీపీ నుంచి ఒక్కొకరుగా పార్టీ కి దూరం జరగడం, వారితో పాటే వారి అణుచరులను పార్టీకి దూరం చెయ్యడంతో విజయనగరంలో బొత్స ఒంటరి పోరాటం తప్పదా అన్న ప్రశ్నలు తలెత్తాయి. అలాగే అందుకు తగ్గట్టే సీనియర్ రాజకీయ నాయకుడిగా, వైసీపీ శాసనమండలి ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ సైతం చిన్న శీను రాజీనామా తరువాత పలుమార్లు బహిరంగంగానే కంట తడిపెట్టారు.
దీనితో పార్టీ క్యాడర్ ఉత్తరాంధ్రలో వైసీపీ ఖాళీ అయినట్టేనా అన్న ఆత్మరక్షణలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో పార్టీ క్యాడర్లో తిరిగి జోష్ నింపేందుకు, లీడర్లలో ఆత్మస్తైర్యం పెంపొందించేందుకు వైసీపీ ఉత్తరాంధ్ర బీసీ గర్జన పేరుతో ఉత్తరాంధ్ర లో భారీ బహిరంగ సభకు శ్రీకారం చుట్టి ఉండవచ్చు.
ఎక్కడ పోగుట్టుకున్నామో అక్కడే తిరిగి రాబట్టుకోవాలని సామెత ఆధారంగా వైసీపీ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. అయితే పోగొట్టుకోవడానికి ఒక్క క్షణం చాలు, అలాగే ఒక్క నిర్ణయం సరిపోతుంది, ఒక్క తప్పటడుగు ఓటమిని నిర్దేశిస్తుంది, కానీ రాబట్టుకోవడానికి ఒక్క సభ సరిపోతుందా.? ఒక్క గర్జన తో పని పూర్తవుతుందా.?





