తెలుగు సినీ పరిశ్రమలో విజయాల శాతం రెండెంకలకు ఎప్పుడు చేరుకుంటుందోనని సినీ పెద్దలు, పండితులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇలా నిరీక్షించడం, ఆ తర్వాత షరామామూలుగానే తదుపరి సంవత్సరానికి గణాంకాలు లెక్కించుకోవడం జరిగిపోతుంటాయి. అందుకే సక్సెస్ ఇచ్చిన వారికి మాత్రమే ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన విలువ ఉంటుంది. అది హీరోలైనా, దర్శకులైనా… ఇంకెవరైనా..!
ఇక, హీరోల విషయానికి వస్తే… గత దశాబ్ద కాలంలో వరుసగా మూడు విజయాలను అందించిన హీరోలను పరిశీలిస్తే… కేవలం ఆరుగురు మాత్రమే ఈ జాబితాలో చేరారు. అందులో ముగ్గురు పెద్ద హీరోలు కాగా, మరో ముగ్గురు చిన్న హీరోలు. స్టార్ హీరోల సినిమాలను పరిశీలిస్తే… తొలుత ‘దూకుడు, బిజినెస్ మెన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి చిత్రాలతో ‘హ్యాట్రిక్’ హిట్లకు శ్రీకారం చుట్టారు ప్రిన్స్ మహేష్ బాబు. ఆ తర్వాత ‘కింగ్’ నాగార్జున ‘మనం, సోగ్గాడే చిన్నినాయనా, ఊపిరి’ సినిమాలతో ‘హ్యాట్రిక్’ కొట్టగా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ‘రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు’ సినిమాలతో హ్యాట్రిక్ అందుకున్నాడు.
అయితే పెద్ద హీరోలకు తామేమీ తక్కువ కాదంటూ ఓ ముగ్గురు చిన్న హీరోలు కూడా టాలీవుడ్ కు ‘హ్యాట్రిక్’ హిట్లను అందించారు. సిల్వర్ స్క్రీన్ పై అద్భుతమైన అభినయాన్ని కనపరిచే శర్వానంద్ “రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, ఎక్స్ ప్రెస్ రాజా” సినిమాలతో తన సత్తా చాటుకున్నాడు. అలాగే వినూత్నమైన సినిమాలను అందించే నిఖిల్ “స్వామి రారా, కార్తీకేయ, సూర్య వర్సెస్ సూర్య” సినిమాలతో ‘హ్యాట్రిక్’ను నమోదు చేసాడు. ఇక లేటెస్ట్ గా హీరో నాని అతి తక్కువ వ్యవధిలో “భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీరప్రేమగాధ, జెంటిల్ మెన్” సినిమాలతో ‘హ్యాట్రిక్’ కొట్టాడు.
నటన పరంగా హీరోలను విభజించడం సరైన పద్ధతి కాదు గానీ, వారికున్న మార్కెట్ విలువను బట్టి ‘పెద్ద – చిన్న’ అని చెప్పుకోవాల్సి వస్తోంది. సక్సెస్ ఇచ్చే ‘కిక్’ ఏ హీరోకైనా ఒక్కటే… అయితే సక్సెస్ రేంజ్ లో మాత్రం తేడా ఉంటుంది. ఎంతోమంది సినీ వారసులు కొలువున్న తెలుగు చిత్ర పరిశ్రమలో పదేళ్ళ సమయంలో ఓ ఆరుగురు హీరోలు మాత్రమే వరుస విజయాలు అందించడమనేది… టాలీవుడ్ లో ఉన్న సక్సెస్ కొరతను చాటిచెప్తోంది. అయితే ఈ ఆరుగురు హీరోలు అందించిన సినిమాలను గమనిస్తే… విలక్షణత ఉన్న వరుస మూడు సినిమాలే తారసపడతాయి. ఓ అర్ధవంతమైన కొత్తదనం కలిగిన కధలతో ప్రేక్షకుల ముందుకు వస్తే ఆశీర్వదించడానికి తాము సిద్ధం అన్న విషయాన్ని ప్రేక్షకులు స్పష్టంగా చెప్తున్నారు.



