వలస పక్షుల గురించి వినుంటాం, పలుమార్లు చూసుంటాం. కాలాన్ని బట్టి పక్షులు వేరు వేరు ప్రాంతాలకు వలస వెళుతుంటాయి. ఇప్పుడు ఇదే దారిలో టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కూడా ప్రయాణిస్తున్నారు. బండెనక బండి కట్టి అన్నట్లుగా.. ఒకరి తర్వాత ఒకరు మలయాళ చిత్రసీమకు క్యూ కడుతున్నారు.
మలయాళ చిత్రసీమతో తెలుగు ఇండస్ట్రీకి మంచి అవినాభావ సంబంధం ఉన్నప్పటికీ.. ఎందుకో డైరెక్ట్ ప్రొడక్షన్ లోకి మాత్రం ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ.. గత కొన్నేళ్లుగా మలయాళ ఇండస్ట్రీ సక్సెస్ రేషియో చాలా టెంప్టింగ్ గా ఉండడంతో.. కొందరు బడా తెలుగు నిర్మాతలతోపాటు కొత్త తెలుగు నిర్మాతలు కూడా మలయాళం సినిమాలు తీయడానికి ఆసక్తి చూపుతున్నారు.
తెలుగులో వరుస విజయాలు అందుకుంటూ బడా సంస్థగా ఎదిగిన మైత్రీ మూవీ మేకర్స్ “అదృశ్య జలకంగళ్, నడిగర్” వంటి సినిమాలతో మలయాళంలోనూ మంచి ఎంట్రీ కోసం ప్రయత్నించగా.. రెండూ ఫ్లాప్ అవ్వడంతో సైలెంట్ అయిపోయారు.
సాహు గారపాటి మాత్రం “వ్యసనసమేతం బంధుమిత్రాధికల్, వాలా 2” వంటి సినిమాలతో మంచి సక్సెస్ అందుకొని ఇప్పుడు మూడో ప్రాజెక్ట్ సెట్ చేసుకునే పనిలో ఉన్నారు. సాహు బాటలోనే రమ్య వేములపాటి అనే యువ నిర్మాత కూడా మలయాళంలో ఇండస్ట్రీలోకి ఇంట్రీ ఇచ్చింది.
తెలుగులో “పతంగ్” అనే సినిమా నిర్మించి డీసెంట్ హిట్ అందుకున్న రమ్య వేములపాటి, రీసెంట్ గా మలయాళంలో “మహారాజా హాస్టల్” అనే సినిమా నిర్మించి హిట్ కొట్టారు.
మొన్నామధ్య టోవినో థామస్ తో “పల్లిచట్టంబి” అనే మలయాళ సినిమాని నిర్మించింది కూడా నెల్లూరుకు చెందిన తెలుగు నిర్మాతలే. కాకపోతే ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో వాళ్ల ఉనికి పెద్దగా ఎవరికీ తెలియలేదు.
అయితే.. ఇలా నిర్మాతలందరూ మలయాళ ఇండస్ట్రీకి వలస వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తుండడానికి కారణం ప్రొడక్షన్ ఖర్చులు తక్కువ ఉండడం, వర్కింగ్ హవర్స్ అండ్ డేస్ నిర్మాతకి ఖర్చు తగ్గించేలా ఉండడం, రిలీజ్ విషయంలో రాజకీయాలు ఎక్కువగా లేకపోవడం, ఓటీటీ డీల్స్ ప్రోసెస్ లో అక్కడి ఫిలిం ఛాంబర్ చొరవ చూపడం.
ఇదే పద్ధతి కంటిన్యూ అయితే.. తెలుగు ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే నిర్మాతలు డైవర్ట్ అయ్యి మలయాళ ఇండస్ట్రీకి వెళ్లిపోవడం ఖాయం. మరి మన ఛాంబర్ పెద్దలు నిర్మాతలు వలస పోకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారో లేదో చూడాలి.




